పేదలపై ఎందుకింత కక్ష్య
● భూములకు పరిహారం అడిగితే బెదిరింపులా? ● బాధితులను అడ్డుకున్న పోలీసులు ● పంతం నెగ్గించుకున్న అధికారులు
చిల్లకూరు: ‘పేదలపై ఎందుకింత కక్ష్య. మేము ఆ భూములనే నమ్ముకని జీవిస్తున్నాము. తరతరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఇప్పుడు భూములు లాక్కుని పరిహారం ఇవ్వమంటే ఇలా నిర్బంధించడం మంచిదేనా.. మా భూములు లాక్కుని మాకిచ్చే గౌరవం ఇదేనా?’ అంటూ తీర ప్రాంతంలోని తమ్మినపట్నం రైతులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. క్రిస్ సిటీ అభివృద్ధి పనుల కోసం వచ్చిన యంత్రాలను గురువారం గ్రామస్తులు అడ్డుకున్నారు. పరిహారం ఇచ్చేవరకు కదలనివ్వమని భీష్మించుకున్నారు.
పరిహారం ఎందుకివ్వరు?
తమ్మినపట్నం రెవెన్యూ పరిధిలో సుమారు 980 ఎకరాల భూములను క్రిస్ సిటీ కోసం ఏపీఐఐసీ ద్వారా సేకరించారు. ఇందులో సాగులో ఉన్న భూములకు త ప్ప బీడుగా ఉన్న సుమారు 297 ఎకరాలను పరిహా రం జాబితాలో చేర్చకుండా వదిలేశారు. దీంతో తమ్మినపట్నం, లింగవరం, తీగపాళెం, మన్నేగుంట పల్లెవానిదిబ్బ గ్రామాల రైతులు నిరసనలు చేపట్టారు.
అడ్డుకుంటూ..అరెస్ట్‌లు చేస్తూ
బీడు భూములకు పరిహారం రాకుండా గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్రమీనన్, తహసీల్దార్ శ్రీనివాసులు అడ్డుకుంటున్నారని ఆయా గ్రామాల రైతులు ఆరోపించారు. ఆపై పోలీసులు రంగప్రవేశం చేసి గ్రామస్తులను అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. ఆపై కొంత మందిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. పరిహారం అడిగితే ఎందుకంత కక్ష్య అంటూ గ్రామస్తులు మండిపడ్డారు.


