హక్కుల సాధనే లక్ష్యం
తిరుపతి కల్చరల్: బీసీల హక్కుల సాధనే లక్ష్యంగా జూన్ 6న తిరుపతిలో భారీ స్థాయిలో బీసీల ఆత్మీయ సభ నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలిపారు. శనివారం తిరుపతిలోని ఓ ప్రయివేటు హోటల్‌లో బీసీ ముఖ్యనేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీల పట్ల పాలకులు అవలంభిస్తున్న వివక్షత, నిర్లక్ష్య వైఖరిపై చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరి చూపుతూ దగా చేస్తున్నాయని మండిపడ్డారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కల్లూరు నాగరాజగౌడ్, దక్షిణాది రాష్ట్రాల బీసీ సంక్షేమ సంఘం నేత ఆల్మెన్‌రాజు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు క్రాంతికుమార్, నాయకులు నంజుండప్ప, రెడ్డెప్ప, జెల్లి మధుసూదన్, మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బీ.స్రవంతి, జిల్లా అధ్యక్షురాలు వరలక్ష్మి పాల్గొన్నారు.


