మట్కా నిర్వాహకుల అరెస్ట్
వెంకటగిరి రూరల్: పట్టణంలో మట్కా నిర్వాహకులను స్థానిక ఎస్‌ఐ సుబ్బారావు ఆధ్వర్యంలో చాకచక్యంగా పట్టుకున్నారు. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ వివరాలను సీఐ ఏవీ రమణ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు మట్కాపై ఆశజూపి, అమాయక ప్రజలను టార్గెట్ చేస్తూ రూ.10 కటితే లాటరీ రూ.800 వస్తుందని మభ్యపెట్టి దోచుకుంటున్నట్టు తెలిపారు. ఇందులో ఆటో డ్రైవర్లు, కూలీలు అధికంగా ఉన్నట్టు పేర్కొన్నారు. వెంకటగిరి ఎస్‌ఐ సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దాడులు నిర్వహించినట్టు తెలిపారు. ఈ దాడుల్లో పట్టణానికి చెందిన 8 మంది మట్కా నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.26,200 నగదు, 51 స్లిప్‌లను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. వారిపై ప్రత్యేక నిఘా ఉంచినట్టు తెలిపారు.


