చెరువులో వ్యక్తి మృతదేహం
నాయుడుపేట టౌన్: మండల పరిధిలోని తిమ్మాజికండ్రిగ గ్రామ చెరువులో వ్యక్తి మృతదేహం ఉండడాన్ని సోమవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సీఐ బాబి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి ప్యాంటు చొక్కాతో పాటు అతని చెప్పులు సైతం చెరువు గట్టు వద్దే ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. ముందుగా గుర్తుతెలియని వ్యక్తిగా భావించి విచారణ చేపట్టారు. అయితే మృతుడు పెళ్లకూరు మండలం, చెంబేడు గ్రామానికి చెందిన టైలర్ విజయ మోహన్(34)గా గుర్తించారు. మృతుడు నాయుడుపేట పట్టణంలోని బజారు వీధిలో కుట్టు మిషన్ల దుకాణం పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆదివారం ఉదయం చెంబేడులో ఉన్న ఇంటి నుంచి దుకానానికి వెళుతున్నట్లు చెప్పి వెళ్లాడు. తిరిగి రాత్రి వరకు రాకపోవడంతో అతని ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు మృతుడి భార్య కోకిల పోలీసులకు తెలిపింది. మృతుడు తిమ్మాజికండ్రిగ చెరువు వద్దకు ఎందుకు వెళ్లాడు..? అనే విషయంపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే విజయ మోహన్ మద్యం మత్తులో చెరువులో స్నానం చేసుందుకు వెళ్లి ప్రమాద వశాత్తు ఊబిలో కూరుకుపోయి మృతిచెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అనంతరం విజయమోహన్ మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడి భార్య కోకిల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు సీఐ తెలిపారు.


