తిరుపతి రూరల్ తహసీల్దార్‌పై.. క్రిమినల్ కేసు నమోదు చే
● తిరుపతి రూరల్ ఎస్‌ఐ రామకృష్ణపై విచారణ చేయాలి ● 164 బీఎన్‌ఎస్‌ఎస్ నోటీసు ఇవ్వడంలో నిబంధనలు ఉల్లంఘించారు ● జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు ● నాకు అన్యాయం చేసిన ఆ ఇద్దరిపై కోర్టులో క్రిమినల్ కేసు ఫైల్ చేస్తున్నా ● మీడియా ముందు రిటైర్డ్ డీఎస్పీ భాస్కర్‌నాయుడు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: ‘తిరుపతి రూరల్ తహసీల్దారు రామాంజులు నాయక్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలి.. తిరుపతి రూరల్ ఎస్‌ఐ రామకృష్ణపై శాఖాపరమైన విచారణ చేయాలి.. పోలీసుశాఖలో సుదీర్ఘ కాలం పనిచేసి డీఎస్పీగా రిటైర్డ్ అయిన తరువాత కొనుగోలు చేసిన భూమిలో ఎలాంటి గొడవ లేకుండానే ప్రభుత్వం మంజూరు చేసిన లైసెన్స్ ద్వారా అక్కడ మద్యం దుకాణం పెట్టకుండా అడ్డుకునే క్రమంలో నాకు 164 బీఎన్‌ఎస్‌ఎస్ నోటీసు జారీచేశారు. ఆ నోటీసు ఇవ్వడంలో చట్టబద్ధమైన నిబంధనలు ఎక్కడా అనుసరించకుండా నన్ను భయపెట్టి మానసిక వేదనకు గురిచేసినందుకు ఆ ఇద్దరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణకు ఆదేశించాలి..’ అని రిటైర్డ్ డీఎస్పీ ఎన్.భాస్కర్‌నాయుడు మీడియా ముందు తన ఆవేదనను వెళ్లగక్కారు. ఇంకా ఆయన ఏం చెప్పారంటే.. ‘తిరుచానూరు గ్రామ రెవెన్యూ లెక్క దాఖల సర్వే నం.255–1బీలో 0.21 సెంట్లు భూమిని శ్రీనివాసపురంలో కాపురముంటున్న రిటైర్డ్ డీఎస్పీ భాస్కర్ నాయుడు కొనుగోలు చేశారు. ఆ స్థలంలో కొంతభాగం షాపు నిర్మాణం చేసి మద్యం అమ్మకాలకు కేటాయించారు. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే ఈ భూమిపై అప్పటి తిరుపతి ప్రజాప్రతినిధి బంధువుల కన్నుపడింది. తమ బినామీలతో నకిలీ డాక్యుమెంట్లు చేతబట్టుకుని అప్పటి తిరుపతి రూరల్ మండల తహసీల్దారు రాజగోపాల్, సర్వేయర్ సురేష్‌నాయుడు మరికొంతమంది రెవెన్యూ అధికారుల సహకారంతో ఐదుగురు వ్యక్తులకు అందులో హక్కు ఉందని నకిలీ రికార్డులు సృష్టించారు. దీనిపై భాస్కర్ నాయుడు కోర్టుకు వెళ్లగా తనకు అనుకూలంగా న్యాయస్థానం తీర్పునిచ్చింది. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ భూమిపై తిరుపతికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి బంధువు ఆ భూమిని కాజేసేందుకు రంగంలోకి దిగారు. అంతేకాదు ఆ భూమిలో కొంత భాగాన్ని భాస్కర్‌నాయుడు మద్యం దుకాణం నిర్వహణకు కేటాయించగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏకంగా ఎకై ్సజ్ అధికారులకు ఆ భూమి కోర్టులో ఉందని, అక్కడ మద్యం దుకాణానికి అనుమతించరాదని పిటీషన్లు కూడా పెట్టారు. అంతటితో ఆగకుండా తిరుపతి రూరల్ ఎస్‌ఐ రామకృష్ణకు తమ అనుచరుల ద్వారా ఫిర్యాదు చేయించి ఆ భూమిలో గొడవలు జరుగుతున్నందున అందులోకి ఎవ్వరూ ప్రవేశించకుండా చూడాలని మండల తహసీల్దారుకు రిపోర్టు పంపించేలా ఒత్తిడి చేశారు. అప్పటికే తిరుపతి రూరల్ తహసీల్దారుకు చంద్రగిరి నియోజకవర్గ ప్రజాప్రతినిధి నుంచి ఫోన్లు చేయించగా ఎస్‌ఐ నుంచి రిపోర్టు వెళ్లిన గంటల వ్యవధిలో ఎలాంటి విచారణ చేయకుండానే తిరుపతి రూరల్ తహసీల్దారు రామాంజులునాయక్ గత ఏడాది అక్టోబర్ 23న భాస్కర్‌నాయుడుకు 164 బీఎన్‌ఎస్‌ఎస్ నోటీసులు జారీచేశారు. తన భూమిలో ఎలాంటి గొడవలు లేకున్నా న్యాయస్థానంలో తనకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ ఆ ప్రదేశంలో ఘర్షణలు జరుగుతున్నాయని, ఆ స్థలంలో ఎవ్వరూ ప్రవేశించరాదని నోటీసులు ఇవ్వడం పట్ల భాస్కర్‌నాయుడు జిల్లా కలెక్టర్‌ను కలసి తహసీల్దారుపై చర్యలు తీసుకోవాలని, తిరుపతి జిల్లా ఎస్పీని కలసి ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు అందించారు. అయినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఆ ఇద్దరు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయించి విచారణ జరిపించేలా న్యాయస్థానంలో ప్రయివేటు కేసు దాఖలు చేస్తున్నట్టు భాస్కర్ నాయుడు మీడియాకు వివరించారు. తనకు ఆ ఇద్దరు అధికారులు అన్యాయం చేశారని, ఒక రిటైర్డ్ పోలీసు అధికారిగా ఉన్న తనపైనే ఇలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సామాన్య ప్రజలను వారు ఎలా ఇబ్బంది పెడుతున్నారో ఉన్నతాధికారులు గ్రహించి చట్ట ప్రకారం ఆ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు’.


