రుయాలో టీడీపీ నేతల హల్ చల్
● గంటన్నర పాటు అత్యవసర విభాగంలో హంగామా ● తీవ్ర ఇబ్బందులు పడ్డ రోగులు
తిరుపతి తుడా: తిరుపతి రుయా ఆస్పత్రిలో టీడీపీ నేతలు సోమవారం హల్‌చల్ చేశారు. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారు. తిరుపతి ఒకటవ డివిజన్ మిట్టూరులో ఆదివారం రాత్రి రాములవారి ఊరేగింపు సందర్భంగా వైఎస్సార్‌ీ సపీ, టీడీపీ నేతల మధ్య స్వల్ప వివాదం చెలరేగింది.
టీడీపీ నేతలు రెచ్చిపో యారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను చితకబాదారు. పనిలోపనిగా తిరుపతి ఒకటవ డివిజన్ టీడీపీ అధ్యక్షులు వెంకటేష్‌కు కూడా స్వల్ప గాయమైంది. అతన్ని చికిత్స నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు. పరామర్శ పేరుతో పదుల సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రి వద్ద హైడ్రామా సృష్టించారు. ఫొటోలు, వీడియోల కోసం మీడియా ప్రతినిధులను వరుస పెట్టి పిలిపించుకున్నారు. ఒక్కో నాయకుడు వచ్చిన ప్రతిసారీ పరామర్శ కోసం వెళుతూ తీవ్ర అసౌకర్యాన్ని కలిగించారు.
వైద్య సేవలకు ఆటంకం
టీడీపీ నాయకుడిని పరామర్శించేందుకు శాప్ చైర్మన్ రవినాయుడుతో పాటు ఆ పార్టీ సీనియర్ నేతలు నరసింహయాదవ్, పులిగోరు మురళీకృష్ణారెడ్డి, తిరుపతి నియోజకవర్గ పార్టీ అధ్యక్ష కార్యదర్శుడు చినబాబు మహేష్‌యాదవ్, వివిధ అనుబంధ సంఘాల నేతలు క్యూకట్టారు. సుమారు గంటన్నరకు పైగా అత్యవసర విభాగంలో హంగామా సృష్టించారు. టీడీపీ నేతలు పరామర్శకు రావడంతో ఆ బాధితుడు వద్దే అధికారులు చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. దీంతో చుట్టుపక్కల బెడ్లపై పడి ఉన్న రోగులకు సకాలంలో వైద్యం అందించలేకపోవడం గమనార్హం.
అంబులెన్స్‌లకు ఆటంకం
రుయా అత్యవసర విభాగానికి ప్రతి ఐదారు నిమిషాలకు ఒక అంబులెన్స్ వస్తుంటుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు కడప, నెల్లూరు సమీప ప్రాంతాల నుంచి వైద్యం కోసం రుయాకు వస్తుంఉంటారు. ఈ క్రమంలో సుదీర్ఘంగా టీడీపీ నేతలు అత్యవసర విభాగం వార్డులో తిష్ట వేయడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. అత్యవసర విభాగం ముందు అంబులెన్స్‌లు నిలిపే ప్రాంతంలో తరచూ టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో అత్యవసర విభాగానికి రోగులను తీసుకువచ్చిన అంబులెన్స్ కు దారి వదలకపోవడంతో సకాలంలో వారిని బెడ్లపై చేర్చలేకపోయారు. రైలు కిందపడి ఓ యువకుడి కుడికాలు పూర్తిగా తొలగిపోయి అత్యవసర వైద్యం కోసం రుయాకు వచ్చాడు. ఈ క్రమంలో టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడడం వల్ల అంబులెన్స్ లోని ఆ యువకుడిని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లేందుకు 10 నిమిషాల పాటు సమయం పట్టింది. దీంతో అక్కడ ఉన్న రోగులు, వారి సహాయకులు టీడీపీ నేతలపై మండిపడ్డారు.


