ఏఐతో భావి తరాలకు సంస్కృత జ్ఞానం
తిరుపతి సిటీ: కృత్రిమమేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), మెషిన్ లెర్నింగ్‌తో భావితరాలకు సంస్కృత జ్ఞానాన్ని అందించవచ్చని వీసీ జీఎస్‌ఆర్ కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. జాతీయ సంస్కృత వర్సిటీ, సీ–డాక్ సంస్థ సంయుక్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్వాంటం కంప్యూటింగ్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ అనే అంశంపై మంగళవారం రెండ్రోజుల జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ ఎన్‌ఈపీ–2020 ప్రకారం నూతన ఆవిష్కరణల వైపు విద్యార్థులు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. చైన్నె ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి వర్చువల్ విధానంలో మాట్లాడారు. ఆధునిక సాంకేతికతను సంస్కృత శాస్త్రాలతో సమన్వయం చేసి సరికొత్త లక్ష్యాలను సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. శాస్త్రాలలో కృత్రిమ మేధస్సు వినియోగంతో పాటు సంస్కృతంలో ఏఐ ఆధారిత పరిశోధనలను ప్రొత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. సీ–డాక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సుదర్శన్ మాట్లాడుతూ సంస్కృత వ్యాకరణం, పద నిర్మాణం వంటి అంశాల్లో కృత్రిమ మేధ వినియోగంపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కేవీ నారాయణరావు, విభాగాధిపతి కే.గణపతి భట్, తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్ కృష్ణ ప్రపూర్ణ, డాక్టర్ కాళిదాసు, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ చంద్రశేఖరం, ప్రొఫెసర్ శ్రీధర్, డాక్టర్ మేరి సుజాత, నాగలక్ష్మి, ప్రసన్న, సంకీర్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


