మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
తిరుపతి తుడా: మెటర్నిటీ హాస్పిటల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు మూడు నెలల జీతాలు ఇవ్వాలని ఏఐటీయూసీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి మహేంద్ర డిమాండ్ చేశారు. తిరుపతి ప్రసూతి ఆస్పత్రి ఎదుట కార్మికులతో కలసి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీతాల విషయమై పలుసార్లు కాంట్రాక్టర్‌ను, సూపరింటెండెంట్‌ను కలసి విన్నవించినా స్పందించకపోవడం దారుణమన్నారు. రుయాస్పత్రిలో, మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న కార్మికులకు జీతాలు చెల్లించి మెటర్నటీ ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికుల పట్ట కక్ష సాధింపు ధోరణితో వేతనాలు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులు సమస్యల పరిష్కారం కోసం పలుసార్లు జిల్లా కలెక్టర్‌కు, సూపరింటెండెంట్‌కు విన్నవించిన స్పందించలేదని వాపోయారు. ఏ వన్ కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెట్టామని గతంలో ప్రకటించినా నేటికీ వారే కొనసాగడం దారుణమన్నారు. కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు సైతం కాంట్రాక్టర్లు అమలుపరచడం లేదని అలాంటి దుర్మార్గం ఇక్కడ నడుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికుల నాయకులు గురమ్మ్ర, వనజ, ముని, రాజమ్మ, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
మెటర్నిటీ హాస్పిటల్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా


