రాహు–కేతులు!
మింగేస్తున్న..
● ముక్కంటి ఆలయంలో విచ్చలవిడిగా వసూళ్లు ● రాహు–కేతు పూజల పేరుతో దోచుకుతింటున్న దళారులు ● దక్షిణం పేరుతో యథేచ్ఛగా దందా ● రోజుకు సగటున ఒక్క రాహు–కేతు పూజల్లోనే రూ.5 లక్షలకుపైగా దిగమింగుతున్న వైనం ● కన్నెత్తి చూడని అధికార గణం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయం దక్షిణ కై లాసంగా, శివయ్య పంచభూత లింగాలలో ముఖ్యమైన వాయు లింగంగా వర్ధిల్లుతోంది. దక్షిణ కై లాసంగా.. సద్యోముక్తి క్షేత్రంగా పురాణాల్లో ఖ్యాతి గడించింది. ఇక్కడ స్వామివారి తల మీద ఐదు తలల పాము రాహువు గాను, అమ్మవారి వడ్డాణంలో ఒక తల పాము కేతువుగా పూజలందుకుంటున్నాయి. ఇక్కడ చేసే సర్ప దోష నివారణ, రాహు–కేతు, పాప గ్రహ దోష నివారణ పూజలకు దేశవ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలతోపాటు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రాహు–కేతు పూజల కోసం భక్తులు శ్రీకాళహస్తి ఆలయానికి వస్తుంటారు.
పాపహరణం పేరుతో నిలువు దోపిడీ
రాహు–కేతు పూజల కోసం అన్ని పూజా సామగ్రి, ద్రవ్యాలు ఆలయం తరఫున అందజేస్తున్నారు. పూజ అనంతరం పూజారులు రాహు–కేతు పూజలు చేసుకున్న భక్తులు పూజా ఫలాన్ని సంపూర్ణంగా అందుకోవాలంటే, గోదానం, భూదానం, వస్త్రదానాలలో ఏదో ఒక దానం చేయాలని, ప్రస్తుతానికి అవన్నీ లేకపోవడం వల్ల రూ.101 దక్షిణగా పెట్టాలని భక్తుల మనోభావాలపై, విశ్వాసంపై ఆంక్షలు పెట్టి డబ్బులు దండుకుంటున్నారు. పూజ అనంతరం భక్తుల మనోభావాలతో ఆడుకుని అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు.
దళారుల దందా
ఆలయం చుట్టుపక్కల రాత్రి నిద్ర చేసి పూజ చేసుకోవాలని వచ్చిన భక్తులను ఉదయం లేపి మరీ దళారులు దోచుకుంటున్నారు. పసుపు దారం చెట్లకు కట్టి, దీపాలు పెట్టి రాహు–కేతు పూజలు చేసుకోవాలంటూ భక్తులను బురిడీ కొట్టిస్తున్నారు. ఆపై వారి దగ్గర రెండు దీపాలు, పసుపు దారాలు, టెంకాయలు అవసరం లేకున్నా ఎక్కువ ధరలకు అంటగడుతున్నారు.
మండపాల్లో పనిచేయడానికి పోటీ
కాసుల వర్షం కురుస్తుండడంతో రాహు–కేతు పూజా మండపాల్లో పనిచేయడానికి స్వీపర్ నుంచి సెక్యూరిటీ వరకు అందరూ పోటీ పడుతుంటారు. పూజారులైతే పెద్ద ఎత్తున లాబీయింగ్ చేసి మరి విధులు నిర్వహిస్తుంటారు. గతంలో వేద పండితులు ఎవరూ రాహు–కేతు మండపాల్లో పని చేయకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కి మరీ అక్కడ పని చేయడానికి పోటీపడుతున్నారు. ఇప్పటికై నా ఆలయాధికారులు రాహు–కేతు పూజల పేరుతో జరుగుతున్న అక్రమ దోపిడీని అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
రాహుకేతు మండపాల నుంచి పూజలు చేసుకుని బయటకు వస్తున్న భక్తులు
నెలకు రూ.కోటి పైనే వసూళ్లు
సుమారు నెలకు పది వేలకు పైగా రాహు–కేతు పూజలు చేస్తుంటారు. పూజకు వంద రూపాయలు వసూలు చేసినా.. నెలకు కోటి రూపాయల దాకా రాహు–కేతువు పూజా మండపాల్లో అక్రమ వసూళ్లు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఈ డబ్బుల్ని కింద నుంచి పై వరకు అందరూ పంచుకోవడం వల్లే ఎవ్వరూ దీనిపై నోరుమెదపడం లేదన్న విమర్శలున్నాయి. భక్తులెవరైనా ఫిర్యాదు చేసినా... వారిపైనే ఎదురుదాడికి దిగే పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది.
గతంలో గగ్గోలు – అధికారంలోకి వచ్చాక అనుయాయులతో అక్రమాలు
గతంలో టీడీపీ నాయకులు రాహు–కేతు మండపాల్లో ఏదో జరిగిపోతోందని గగ్గోలు పెట్టారు. ఇష్టారాజ్యాంగ దోచుకుంటున్నారంటూ విషప్రచారానికి బీజం వేశారు. మరి ప్రస్తుతం దోష పూజల్లో ఆలయ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నా ముఖ్య నాయకుడు కట్టడి చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.


