దివికేగిన గ‘ఘన కీర్తి’
● ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరిరంగన్ కన్నుమూత ● ఆయన సేవలు గుర్తుచేసుకున్న శాస్త్రవేత్తలు ● పలువురి నివాళి
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తొలితరం శాస్త్రవేత్తల్లో ముఖ్యులు, అలాగే ఇస్రో చైర్మన్‌గా పదేళ్లు పనిచేసిన డాక్టర్ కృష్ణస్వామి కస్తూరిరంగన్ (85) శుక్రవారం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో ఇస్రో శాస్త్రవేత్తలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన సేవలు అజరామరమని, ఆయన లేని లోటు తీర్చలేనిదని కుమిలిపోయారు.
అనుభవాల ‘గని’
షార్‌లో ప్రయోగం జరిగిన ప్రతిసారీ కస్తూరిరంగన్ ఇక్కడకు విచ్చేసి తన అనుభవాలను పంచుకునేవారు. చంద్రయాన్–1, 2, 3, మంగళ్‌యాన్–1, ఆదిత్య ఎల్1 లాంటి ప్రతిష్టాత్మక ప్రయోగాలు చేసిన ప్రతిసారీ ఆయన ఇక్కడకు విచ్చేసి సలహాలు, సూచనలు ఇచ్చేవారు. అదేవిధంగా సూళ్లూరుపేట పట్టణంలో 150 ఏళ్ల ముందు నిర్మించి, శిథిలావస్థకు చేరిన ఉన్నత పాఠశాల అభివృద్ధికి తన వంతుగా రూ.25 లక్షలు వెచ్చించి మరమ్మతులు చేయించారు.
ఇస్రో చైర్మన్‌గా కస్తూరిరంగన్ ప్రయాణం
ఇస్రోలో కస్తూరిరంగన్ 1971 నుంచి వివిధ హోదాల్లో పనిచేశారు. అనంతరం 1994లో ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 2003 ఆగస్టు 27న పదవీ విరమణ చేశారు. 2003 దాకా పనిచేసిన ఆయన పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ మార్క్–3 లాంటి భారీ రాకెట్ల రూపకల్పనలో ఆయన భాగస్వామ్యం ఎంతో ఉంది. 1994లో ఏఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఒక ప్రయోగం, పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో పీఎస్‌ఎల్‌వీ డీ2 ప్రయోగంతో ప్రారంభమై ఏడు పీఎస్‌ఎల్‌వీ రాకెట్ ప్రయోగాలకు సారథ్యం వహించారు. అప్పుడే పురుడుపోసుకున్న జీఎస్‌ఎల్‌వీ రాకెట్ సిరీస్‌లో కూడా రెండు ప్రయోగాలు ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారు. పదేళ్లు చైర్మన్‌గా పనిచేసిన కాలంలో పది ప్రయోగాలను నిర్వహించారు. ఇస్రో నిర్వహించిన వంద ప్రయోగాలను ఆయన వీక్షించడం విశేషం. ఆయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ,, పద్మభూషణ్, పద్మ విభూషణ్ లాంటి అవార్డులను అందజేసింది. ఇవి కాకుండా ఆయన 45 అవార్డులను అందుకున్నారు. ఖగోళశాస్త్రం, అంతరిక్ష శాస్త్రం, అంతరిక్ష అనువర్తనాలు వంటి రంగాలపై ఆయన రాసిన వ్యాసాలు అంతర్జాతీయ, జాతీయ ప్రతికలలో ప్రచురితమయ్యాయి. అలాగే ఆయన ఆరు పుస్తకాలను కూడా రచించి నేటి తరం విద్యార్థులకు అందించారు. షార్ డైరెక్టర్ ఏ రాజరాజన్, కంట్రోలర్ శ్రీనివాసులురెడ్డి, అన్ని విభాగాలకు చెందిన ఏడీలు, శాస్త్రవేత్తలు ఆయనకు తమ సంతాపాన్ని తెలియజేశారు.
కస్తూరి రంగన్‌కు అశ్రునివాళి
తిరుపతి సిటీ: సుప్రసిద్ధ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్, భారతదేశ అంతరిక్ష విభాగ శాస్త్రవేత్త, నూతన విద్యావిధానాల రూపశిల్పి డాక్టర్ కృష్ణస్వామి కస్తూరిరంగన్‌కు ఎస్వీయూ అశ్రు నివాళి అర్పించింది. ఎస్వీయూతో ఆయనకున్న అనుబంధాన్ని వీసీ అప్పారావు గుర్తుచేశారు. అంతరిక్ష విజ్ఞాన శాస్త్రం, జాతీయ విద్యాఅభివృద్ధికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా వరిర్సటీ డాక్టర్ ఆఫ్ సైన్స్ గౌరవ డిగ్రీని ప్రదానం చేసిందని తెలిపారు. 2022లో వర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆయన విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందించారని తెలిపారు. ఎన్‌ఈపీ–2020 కమిటీ చైర్మన్‌గా పనిచేసిన ఆయన విద్యావ్యవస్థలో పలు సంస్కరణలకు మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతికలగాలని వీసీ ప్రార్థించారు.
ఇస్రో మాజీ చైర్మన్‌కు నివాళి
సూళ్లూరుపేట: ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కే.కస్తూరిరంగన్‌కు షార్ కేంద్రంలో అశ్రునివాళి అర్పించారు. షార్ డైరెక్టర్ ఏ.రాజరాజన్ ఆధ్వర్యంలో షార్ కంట్రోలర్ శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. షార్ గ్రూప్ డైరెక్టర్ గోపీకృష్ణ, ఇతర డిప్యూటీ డైరెక్టర్లు ఆయన సేవలను కొనియాడారు.
దివికేగిన గ‘ఘన కీర్తి’
దివికేగిన గ‘ఘన కీర్తి’


