పనపాకం పరిసరాల్లో ఏనుగుల గుంపు!
చంద్రగిరి: మండల పరిధిలోని పనపాకం అటవీ సమీప గ్రామాల్లో ఏనుగులు సంచరిస్తున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గురువారం రాత్రి మండల పరిధిలోని ఆముదాలకోన చెరువు వద్దకు ఏనుగుల గుంపులు వచ్చినట్లు గుర్తించారు. చెరువులోని నీటిని తాగి పనపాకం అటవీ సమీపం వైపుగా వెళ్లినట్లు తెలిపారు. పంటపొలాల్లో ఏనుగుల పాదముద్రలు, చెరువు వద్ద ఏనుగులు సంచరించిట్లుగా రైతులు గుర్తించారు. పంట పొలాలపై ఏనుగులు దాడులకు పాల్పడకముందే అటవీ అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఒంటరి ఏనుగు హల్‌చల్
భాకరాపేట: చిన్నగొట్టిగల్లు మండలం, చిట్టెచెర్ల పంచాయతీలో ఒంటరి ఏనుగు ఘీంకరిస్తూ పంట పొలాల్లోకి దూసుకొచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి పంచాయతీ పరిధిలోని బోగేవాండ్లపల్లె గ్రామ పంట పొలాల్లోకి రావడంతో గ్రామస్తులు టపాకాయలు కాల్చుతూ.. శబ్దాలు చేస్తూ తరిమేందుకు ప్రయత్నించారు. దీంతో ఏనుగు ఘీంకరిస్తూ మనుషులు వైపు రావడంతో పరుగులు తీశారు. వరి పైరు తొక్కుకుంటూ అటు ఇటు తిరగడంతో రైతులు మిన్నుకుండిపోయారు. అధికారులు తక్షణం స్పందించి ఒంటరి ఏనుగును కట్టడి చేసి, గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ చిన్నగొట్టిగల్లు మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు సింహాల మోహన్ డిమాండ్ చేశారు.


