సచివాలయాలకు
● సచివాలయాల కుదింపుకు శ్రీకారం ● క్షేత్రస్థాయిలో దూరంకానున్న సేవలు ● 691 సచివాలయాలను 349కి కుదింపుకు ప్రతిపాదనలు ● ఉత్తర్వులు అందిన వెంటనే అమలు సన్నాహాలు ● 200లకు పైగా సేవలు అందిస్తున్న సచివాలయాలు ● గత ప్రభుత్వం చేసిన మేలును చెరిపేస్తున్న కూటమి సర్కార్ ● సచివాలయ రూపు రేఖల మార్పుకు కుట్రలు ● ఆర్బీకేలదీ అదే పరిస్థితి
ప్రభుత్వ సేవల కోసం మండల కార్యాలయాల చుట్టూ తిరగకుండా స్థానికంగా అందించేందుకు గత ప్రభుత్వం గ్రామ సచివాలయాలను తీసుకువచ్చింది. రెండు వేల జనాభాకు ఒకటి చొప్పున ఏర్పాటుచేసింది. తద్వారా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని అందించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. వాటి సంఖ్యను కుదించాలని నిర్ణయించింది. రైతులకు స్థానికంగా సేవలిస్తున్న ఆర్బీకేలను సైతం కుదించాలని చూస్తోంది. దీనిపై స్థానికులు మండిపడుతున్నారు. మళ్లీ మండల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని వాపోతున్నారు.
జిల్లాలో 445 రైతు సేవా కేంద్రాలు
జిల్లాలో 445 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను గత ప్రభుత్వంలో ఏర్పాటు చేశారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సేవా కేంద్రాలుగా మార్పు చేశారు. ఆ తర్వాత వాటిని ప్రాధాన్యతను క్రమేణా తగ్గించే కుట్ర చేస్తున్నారని చర్చజరుగుతోంది. రైతు సేవా కేంద్రాల్లో కియోస్క్‌లను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, యంత్ర పరికరాలు, పశువులకు దాణా, పంటల మార్కెటింగ్ తదితర సేవలు అందించేవారు. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత రైతు సేవా కేంద్రాల్లోని కియోస్క్‌లు నిరుపయోగంగా మారాయి. ప్రభుత్వ సర్వర్లు సక్రమంగా పనిచేయకపోవడంతో వాటి సేవలకు మంగళం పలికారు.
తిరుపతి అర్బన్: తిరుపతి జిల్లాలో 691 సచివాలయాలు ఉన్నాయి. ఈ క్రమంలో క్లస్టర్ల పేరుతో రెండు నుంచి మూడు సచివాలయాలను ఒక్కటిగా మార్పు చేసి 349కి కుదించనుంది. తద్వారా నాలుగు నుంచి ఐదు గ్రామాలకు చెందిన వారికి ఒక్కచోట సేవలు అందించనుంది. అలాగే పట్టణ, నగర ప్రాంతాల్లోను నాలుగు వార్డులకు చెందిన సచివాలయాలను ఒక్కటిగా చేయనుంది. ఆర్బీకేలదీ అదే పరిస్థితి. ఈ క్రమంలోనే పలుచోట్ల నిర్మాణంలో ఉన్న సచివాలయాలను పూర్తి చేయకుండా వదిలేసింది.
సర్వేలో సచివాలయ ఉద్యోగులు
గ్రామ, వార్డు సచివాలయాల్లో 200లకు పైగా సేవలు అందించే ఉద్దేశంతో గత సర్కార్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కూటమి సర్కార్‌లో సచివాలయ వ్యవస్థకు మంగళం పాడాలనే నిర్వీర్యం చేస్తోందని పలువురు మండిపడుతున్నారు. 30 శాతానికి పైగా ఉద్యోగుల ఖాళీలు ఉన్నా వాటిని భర్తీ చేయలేదు. వలంటీర్లను తొలగించి వారు చేస్తున్న పింఛన్ల పంపిణీ బాధ్యతలు సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. అంతటితో ఆగకుండా 30కి పైగా సర్వేల బాధ్యతలు సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. దీంతో వారు కార్యాలయంలో ఉండకుండా నిత్యం ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు.
ప్రభుత్వానికి వివరాలు ఇస్తున్నాం..
ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు జనాభా ప్రాతిపదికన క్లస్టర్లుగా విభజించి, ఉద్యోగుల వివరాలను సేకరించాం. ప్రభుత్వానికి ఓ నివేదిక అందిస్తాం. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ముందుకు సాగుతాం. 2500 లోపు జనాభా ఉన్న సచివాలయాలు, 2500లకు పైగా 3500ల లోపు జనాభా, 3500లకు పైగా జనాభా ఉన్న సచివాలయల జాబితాను సిద్ధం చేశాం. – నారాయణరెడ్డి, జిల్లా సచివాలయాల అధికారి
సచివాలయాలు ఎంతో సౌకర్యం
సచివాలయ వ్యవస్థను ఏ ప్రభుత్వం పెట్టినా అందరికీ ఎంతో సౌకర్యంగా ఉంది. ఈ వ్యవస్థను కుదించడం ద్వారా మళ్లీ ఒక గ్రామానికి చెందిన వారు మరో గ్రామానికి వెళ్లాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇందులో రాజకీయాలు చేయకుండా యధావిధిగా కొనసాగించాలనేది మా అభిప్రాయం. అలా ఉంటేనే ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. – వెంకటేష్, చిరు వ్యాపారి
రైతు సేవా కేంద్రాలు చురుగ్గా ఉండాలి
రైతు సేవా కేంద్రాలు చురుగ్గా ఉండాలి, ఎరువులు, పశువులకు దాణా, విత్తనాలతోపాటు రైతులకు సాగు పద్ధతులపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం, అలాగే కియోస్క్‌లను అందుబాటులోకి తీసుకొచ్చి రైతులకు అండగా ఉండాలి. రైతు సేవా కేంద్రాల్లో అగ్రికల్చర్ అసిస్టెంట్ల కొరత లేకుండా చూడాలి. వాటిని కుదింపు చేస్తే రైతులకు కష్టాలు వస్తాయి. – నరేంద్ర యాదవ్, రైతు
డివిజన్ల వారీగా సచివాలయాలు
ప్రస్తుతం గ్రామ, క్లస్టర్లు ఏర్పాటు
వార్డుల్లో ఉన్నవి చేస్తే వచ్చేవి
తిరుపతి 245 124
శ్రీకాళహస్తి 154 81
సూళ్లూరుపేట 137 67
గూడూరు 155 77
మొత్తం 691 349
సచివాలయాలకు
సచివాలయాలకు
సచివాలయాలకు
సచివాలయాలకు


