కూసుమంచిలోని శివాలయం
కూసుమంచి (ఖమ్మం): కాకతీయుల భక్తిభావం, కళావైభవానికి ప్రత్యక్షసాక్ష్యం కూసుమంచిలోని శివాలయం. ఈశివాలయాన్నే గణపేశ్వరాలయంగా, రామలింగేశ్వరస్వామి ఆలయంగా కూడా పిలుస్తున్నారు. క్రీ.శ 11–12వ శతాబ్ధంలో కాకతీయుల కాలంలో వెయ్యిన్నొక్కటి శివాలయాల నిర్మాణ క్రమంలో గణపతి దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి.
ఈ ఆలయంలోని శివలింగం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద శివలింగాల్లో ఒకటిగా ప్రసిద్ది చెందింది. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఉత్తర దిశగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణం ఓ చేయి, కాలు లేని శిల్పి చేశాడనేది ప్రచారంలో ఉంది. ఈ ఆలయాన్ని పెద్దపెద్ద బండరాళ్లతో పేర్చిన ఘనత ఆ శిల్పికే దక్కింది.
(చదవండి: అపార్ట్‌మెంట్‌లో బోర్‌వాటర్ వివాదం.. వాటర్‌ట్యాంక్ ఎక్కి దంపతుల హల్‌చల్)
శివాలయంలోని శివలింగం
ఆలయాన్ని పైగుండా చూస్తే నక్షత్రాకారంలో, మరోవైపు శివలింగాకారం ఉన్నట్లుగా బండరాళ్లను పేర్చి వాటిపై ఆలయాన్ని నిర్మించటం విశేషం. ఇక ఆలయంలో ఉన్న శివలింగం 6 అడుగుల ఎత్తు. 5.3 సెంమీ వ్యాసార్థంతో ప్రతిష్టించగా అది నున్నటి గ్రానైట్ రాయిని పోలి ఉంటుంది. శివలింగంపై ప్రతినిత్యం సూర్యోదయ సమయాన సూర్యకిరణాలు ప్రసరించేలా ఆలయాన్ని నిర్మించటం మరో విశేషం.
వందలాది సంవత్సరాల పాటు కంపచెట్లు, మట్టిదిబ్బలతో జీర్ణావస్థకు చేరింది. గ్రామంలో గొప్ప ఆలయం ఉన్నా దాన్ని ఎవరూ పట్టించుకోక పోవటంతో అది ఎలా ఉందో కూడా గ్రామస్తులకు తెలియని పరిస్థితి. నాటి కూసుమంచి సీఐగా ఉన్న సాథు వీరప్రతాప్‌రెడ్డి దృష్టికి ఆలయం విషయం రావటంతో గ్రామస్థుల సహకారంతో ఈఆలయాన్ని వెలుగులోకి తీసుకవచ్చారు.
దాన్ని అభివృద్ది పరిచి పూజలు ప్రారంభింపజేశారు. భక్తుల చొరవతో ఈ ఆలయం క్రమంగా వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత మహా ఆలయంగా వెలుగొందుతోంది. ఈ ఆలయాన్ని దర్శించటం పునర్జన్మ సుకృతంగా పెద్దలు అభివర్ణిస్తున్నారు. కూసుమంచి శివాలయాన్ని దర్శిస్తే కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల నమ్మకం. అందుకే ఈశివాలయం భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతూ.. నానాటికి దినదినాభివృద్ధి చెందుతోంది.
ప్రతి శివరాత్రికి ఖమ్మం జిల్లాతో పాటు పొరుగున ఉన్న ఉమ్మడి నల్లగొండ, వరంగల్ నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ప్రతియేడు వేల మంది భక్తులు ఈ శివాలయాన్ని దర్శించుకుంటున్నారు.
(చదవండి: జంగు ప్రహ్లాద్ కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం..)
Comments
Please login to add a commentAdd a comment