శతాబ్దాల క్రితం నిర్మించిన ‘నాగన్నగారి బావి’! | Stair Well In Lingam Peta Built Centuries Ago Are Still Intact | Sakshi
Sakshi News home page

శతాబ్దాల క్రితం నిర్మించిన ‘నాగన్నగారి బావి’!

Published Sat, Jan 29 2022 9:27 PM | Last Updated on Sat, Jan 29 2022 9:39 PM

Stair Well In Lingam Peta Built Centuries Ago Are Still Intact - Sakshi

సాక్షి, కామారెడ్డి: చారిత్రక కట్టడాల్లో మెట్ల బావులు ఒకటి.  శతాబ్ధాల క్రితం నిర్మించిన మెట్ల బావులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అయితే  పాలకుల నిర్లక్ష్యంతో అవి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.  అప్పట్లో ప్రజల దాహార్తి తీర్చేందుకు, పంటలు సాగు చేసుకునేందుకు మెట్ల బావులను వాడినట్టు చెబుతుంటారు. శిల్పకళా కౌశలంతో మెట్ల బావులు నిర్మించినట్టు అక్కడి ఆనవాళ్లు చెబుతుంటాయి.  ఇటీవల హైదరాబాద్‌ నగరంలోని బన్సీలాల్‌పేటలో వందల ఏళ్ల క్రితం నాటి మెట్ల బావి వెలుగు చూసిన విషయం తెలిసిందే. అలాంటి కట్టడం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా లింగంపేట మండల కేంద్రంలో కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై పోలీస్‌ స్టేషన్‌కు ఎదురుగా ఈ బావి ఉంది. 

దీన్ని  ‘నాగన్నగారి బావి’గా పిలుస్తారు.  ఈ మెట్ల బావి నిర్మాణంలో  కళా నైపుణ్యం అబ్బురపరుస్తుంది. జక్సాని నాగన్న అనే వ్యక్తి ఈ దిగుడు బావిని నిర్మించాడని, అందుకే దాన్ని నాగన్న బావి అంటారని గ్రామస్తులు చెబుతారు.  బావి అడుగు భాగం నుంచి పై భాగం వరకు అందమైన శిలలతో నిర్మించారు. పై నుంచి అడుగు వరకు మెట్లు ఉన్నాయి.  బావికి నలు వైపులా మెట్లు ఉన్నాయి. ప్రధాన మార్గాన్ని పడమర దిశలో ఏర్పాటు చేశారు. ఉపరితలం నుంచి 20 అడుగులకు ఒక అంతస్తు చొప్పున ఐదు అంతస్తులు అంటే దాదాపు వంద అడుగుల లోతు ఈ బావిని నిర్మించారు. దీన్ని 18 వ శతాబ్దంలో నిర్మించినట్టు కొందరు పేర్కొంటున్నారు.   సంస్థానాదీషుల పరిపాలన కొనసాగిన కాలంలో ఈ కట్టడం నిర్మితమైందని తెలుస్తోంది. అయితే ఏ సంస్థానాదీషులు నిర్మించారన్నదానిపై సరైన ఆధారాలు లభించడం లేదు. 

అద్భుతమైన నిర్మాణ శైలి....
లింగంపేటలోని నాగన్నబావి (మెట్ల బావి)ని చూస్తే అప్పటి కళానైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. నాలుగు వైపులా ఒకే రకమైన శైలితో అద్భుతమైన నిర్మాణం జరిగింది . బావి ఉపరితలం నుంచి అడుగు వరకు మెట్లు నిర్మించారు. శంఖుచక్రాలు, పుష్పాలు... ఇలా రకరకాల శిల్పాలు చెక్కించారు. బావికి నలువైపులా సుందర దృశ్యాలు ఉంటాయి. బావి పైభాగంలో చిన్నచిన్న కంకర రాళ్ల, డంగు సున్నంతో పైకప్పు వేశారు. తూర్పు భాగంలో బావి నుంచి నీటిని పైకి చేదడానికి మోటబావి లాంటి నిర్మాణం ఉంది. ఇక్కడి నుంచి నీటిని కాలువ ద్వారా తరలించి పంటలకు చేరేలా ఏర్పాట్లు ఉన్నట్టు తెలుస్తోంది. 

పాడుబడిపోతున్న సంపద....
ఎంతో కళానైపుణ్యంతో నిర్మించిన ఈ మెట్ల బావి నిర్లక్ష్యానికి గురవుతోంది. ఎవరూ పట్టించుకోకపోవడం మూలంగా పాడుబడిపోతోంది. ఇప్పటికే పెద్దపెద్ద చెట్లు పెరిగి చెట్ల ఊడలు బయటకు వచ్చాయి. ఎవరూ అటువైపు వెళ్లకపోవడంతో కళావిహీనంగా మారుతోంది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ బావి చుట్టూ పెరిగిన చెట్లను తొలగించి బావిలోపల పెరిగిన పూడికను తొలగించడం ద్వారా పురాతన కట్టడానికి పూర్వ వైభవం తీసుకురావచ్చు. బావి పూడిక తొలగిస్తూ నీటి ఊటలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ బావిపై దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న బావి...
–గణపతి పంతులు, లింగంపేట

నాగన్నబావికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. అప్పట్లో పంటలకు మోటలద్వారా నీరు పారేదని చెబుతారు. మా చిన్నతనంలో చాలా లోతు ఉండేది. రానురాను పూడుకుపోతుంది. మెట్లు ఎంతో అందంగా ఉన్నాయి. గుమ్మటాలు ఆకర్శనీయంగా ఉన్నాయి. ఇలాంటి నిర్మాణాలు మరెక్కడా కనిపించవు. వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది. 

చారిత్రక కట్టడాన్ని కాపాడాలి...
–కొట్టూరి లక్ష్మినారాయణ, లింగంపేట

ఎంతో కళానైపుణ్యంతో బావిని, మెట్లను నిర్మించారు. వందల ఏళ్ల క్రితం నాటివైనా, నిర్లక్ష్యానికి గురవుతున్నపటికీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అలాంటి చారిత్రక కట్టడాన్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పెద్దలు ఈ బావి గురించి చర్యలు తీసుకోవాలి. దానికి మరమ్మతులు చేయించి పూర్వ వైభవం తీసుకురావాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement