వివక్ష లేని సమాజానికి కృషి
అనంతగిరి: ప్రజల్లో సమానత్వాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం కలెక్టర్ ప్రతీక్ జైన్ అధ్యక్షతన జరిగింది. ఎస్సీ, ఎస్టీ అత్యాచార కేసులకు సంబంధించిన విషయాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. నేర ప్రవృత్తి, వివక్షకు తావులేని సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అత్యాచార నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. అత్యాచార కేసులకు సంబంధించి పోలీస్ ఉన్నతాధికారుల సహకారం తీసుకుంటూ సమన్వయంతో సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని డీవీఎంసీ సభ్యులకు సూచించారు. దళితులు ఎలాంటి వివక్షకు గురికాకుండా, వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గ్రామాల్లో ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం ప్రాముఖ్యతను కళాబృందాల ద్వారా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తావులేకుండా బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని చెప్పారు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం సత్వరం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో కేసుల సంఖ్య తగ్గేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి మూడు నెలలకు ఒక్కొసారి డీవీఎంసీ సమావేశాలు జరిగేలా చూడాలని పేర్కొన్నారు. ప్రతి నెలా పౌరహక్కుల దినోత్సవాన్ని నిర్వహించి, సమస్యల పరిష్కారానికి పోలీస్, రెవెన్యూ అధికారులు కృషి చేయాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో ఎస్పీ కే నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు లింగ్యానాయక్, సుధీర్, జిల్లా ఎస్సీ, బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖల అధికారులు మల్లేశం, ఉపేందర్, కమలాకర్‌రెడ్డి, జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకన్న, డీఎస్‌ఓ మోహన్‌బాబు, కమిటీ సభ్యులు అనంతయ్య, జగదీష్, దస్తప్ప, కిరణ్ రోనాల్డ్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
కలెక్టరేట్‌లో నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం
పాల్గొన్న కలెక్టర్ ప్రతీక్‌జైన్
Comments
Please login to add a commentAdd a comment