వెలవెలబోతున్న గ్రామసభలు | - | Sakshi
Sakshi News home page

వెలవెలబోతున్న గ్రామసభలు

Published Sat, Mar 15 2025 7:39 AM | Last Updated on Sat, Mar 15 2025 7:39 AM

వెలవె

వెలవెలబోతున్న గ్రామసభలు

దౌల్తాబాద్‌: గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం గ్రామసభల ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. కానీ క్షేత్రస్థాయిలో ప్రజల భాగస్వామ్యం లేక గ్రామాలు అభివృద్ధి చెందడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అవగాహన కల్పించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతోనే నామమాత్రంగా గ్రామసభలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొంటున్నాయి. గ్రామపంచాయతీల అభివృద్ధిలో గ్రామసభల నిర్వహణ ఎంతో కీలకం. ఆయా శాఖల అధికారులతో పాటు పంచాయతీ పాలకవర్గం సభ్యులు, ప్రజలు గ్రామసభల్లో పాల్గొని సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం చర్చిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరు, లబ్ధిదారుల వివరాల నమోదు గ్రామసభల ద్వారా నిర్వహిస్తారు. ప్రభుత్వాలు చేపట్టే కొత్త పథకాలు, పనులపై ప్రజల అభిప్రాయాలు ఈ సభల ద్వారానే తెలుస్తాయి. ఇంత ప్రాధాన్యం ఉన్న గ్రామసభలు జిల్లాలో నామమాత్రంగానే కొనసాగడం విశేషం.

గ్రామసభల నిర్వహణ ఇలా...

గ్రామపంచాయతీల్లో ప్రతి రెండు నెలలకోసారి గ్రామసభలను సర్పంచ్‌ అధ్యక్షతన నిర్వహించాలి. అయితే ప్రస్తుతం సర్పంచ్‌లు లేకపోవడంతో పంచాయతీ కార్యదర్శులే గ్రామసభలు నిర్వహిస్తున్నారు. పంచాయతీతో పాటు అనుబంధ గ్రామాల్లో సభలు నిర్వహించే తేదీని సంబంధిత పంచాయతీ కార్యదర్శులు సిబ్బందితో దండోరా వేయించాలి. నిబంధనల ప్రకారం విధిగా 17శాఖల అధికారులు జనాభాలో సుమారు 20శాతం మంది ప్రజలు గ్రామసభకు హాజరు అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడంలేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కనీసం 50మందితో గ్రామసభను ఏర్పాటు చేసుకోవాలని నిబంధనలు ఉన్నా తూతూమంత్రంగా గ్రామసభలు ఏర్పాటు చేస్తున్నారు. పంచాయతీ ఆదాయ, వ్యయాలపైన కార్యదర్శులు నివేదికలు చదివి వినిపించాల్సి ఉన్నా పట్టించుకోవడంలేదని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

ఆసక్తి చూపని గ్రామస్తులు

జిల్లాలోని చాలా గ్రామాల్లో నిర్వహించే గ్రామసభలకు కనీసం పది నుంచి ఇరవై మంది కూడా రావడంలేదు. ప్రజాప్రతినిధులు, అంగన్‌వాడీ టీచర్లు, వీఓఏలు, వైద్యసిబ్బంది మాత్రమే వస్తున్నారు. పంచాయతీల అభివృద్ధి విషయంలో ప్రజలకు నాయకులకు మధ్య అంతగా సమాచారం ఉండడంలేదు. గ్రామసభల్లో చర్చిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపితే గ్రామసభలకు ఆదరణ పెరిగే అవకాశం ఉంది. సమస్యలు పేరుకుపోవడంతో సభలకు ఆదరణ తగ్గుతుందని పలువురు ఆరోపిస్తున్నారు.

కనిపించని ప్రజల భాగస్వామ్యం

అవగాహన కల్పించని అధికారులు

ప్రజల భాగస్వామ్యం పెరగాలి

గ్రామసభల్లో ప్రజల భాగస్వామ్యం మరింతగా పెరగాలి. సభల నిర్వహణపై కార్యదర్శులతో గ్రామాల్లో దండోరా వేయిస్తున్నాం. సమాచారం తెలుసుకుని ప్రజలు స్వచ్ఛందంగా సభకు రావాలి. తద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు వీలుంటుంది.

– శ్రీనివాస్‌, ఎంపీడీఓ, దౌల్తాబాద్‌

వెలవెలబోతున్న గ్రామసభలు 1
1/1

వెలవెలబోతున్న గ్రామసభలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement