
ఆలయ కమిటీ ఎన్నికకు దరఖాస్తు చేసుకోండి
మర్పల్లి: మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల నియామకానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉప కమిషనర్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కాపీని ఎండోమెంట్ అధికారి కృష్ణప్రసాద్ మంగళవారం మర్పల్లి ఆంజనేయస్వామి ఆలయంలో గ్రామస్తులకు అందజేశారు. అనంతరం నోటీస్ బోర్డుపై అతికించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరవై రోజుల్లో ఆలయ చైర్మన్, పాలక మండలి సభ్యుల ఎన్నిక కోసం ఎండోమెంట్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సహాయ కమిషనర్ (బొగ్గులకుంట, తిలక్‌రోడ్డు, హైదరాబాద్) కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలని సూచించారు. ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూజారి వినోద్‌శర్మ, గ్రామస్తులు రాములు యాదవ్, సర్వేశ్, నర్సింలు యాదవ్, జగదీశ్, రాచన్న, రంజిత్, రంగారెడ్డి, వీరేశం ఉన్నారు.
ఆటో బైక్ ఢీ..
ఇద్దరికి గాయాలు
పరిగి: ఆటో బైక్ ఢీకొనడంతో ఇద్దరికి గాయాలైన సంఘటన పట్టణ కేంద్రంలోని కృష్ణవేణి స్కూల్ సమీపంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దోమ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బందయ్య, అంజమ్మ పరిగి నుంచి ఇంటికి వెళ్తుండగా కొడంగల్ వైపు నుంచి వస్తున్న ఆటో బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో వారికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 సహాయంతో పరిగి ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం నగరానికి తరలించినట్టు సమాచారం. ఈ రోడ్డు ప్రమాదంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం
బంట్వారం: మానవ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని కోట్‌పల్లి ఎస్‌ఐ అబ్దుల్ గఫార్ పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలో మహిళా సమాఖ్య సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, చిన్నపిల్లలు అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం చేరవేయాలన్నారు. సైబర్ నేరాలు, సీసీ కెమెరాలు, ఫొటో మార్ఫింగ్స్, పోక్సో చట్టం తదితర అంశాలపై ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం శివయ్య, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు నిర్మల, సీసీలు గణేష్, హన్మంత్‌రెడ్డి, సునీత, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
పాస్టర్ మృతిపై ఆందోళన
పరిగి: తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ మత ప్రచారకుడైన పాస్టర్ ప్రవీణ్ పడగాల మృతి ఆందోళన కల్గించే అంశమని వికారాబాద్ జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షుడు క్రిష్ణ మంగళవారం ఓ ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మృతిపై ఎన్నో అనుమాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.

ఆలయ కమిటీ ఎన్నికకు దరఖాస్తు చేసుకోండి

ఆలయ కమిటీ ఎన్నికకు దరఖాస్తు చేసుకోండి