
పంటల నష్టం అంచనా వేయాలి
మర్పల్లి: ఇటీవల కురిసిన వర్షానికి పాడైన పంటల నష్టాన్ని అంచన వేయాలని మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్‌రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. మంగళవారం మండల పరిధిలోని మల్లికార్జునగిరి, బిల్‌కల్ గ్రామాలలో పాడైన పంటలను ఏఓ శ్రీకాంత్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడారు. ఉల్లి, జొన్న, మొక్కజొన్న, కూరగాయ పంటలతో పాటు మామిడికి అపార నష్టం జరిగినట్లు రైతులు కంటతడి పెట్టారు. వ్యవసాయ శాఖ అధికారులు రెండు రోజుల్లో వచ్చి పంటనష్టం అంచన వేస్తారని ప్రభుత్వం నుంచి పరిహారం అందేవిధంగా కృషి చేస్తానని మహేందర్‌రెడ్డి రైతులకు భరోస కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ జోస్న, ఆయా గ్రామాల రైతులు అశోక్, ప్రమోధ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు.
సుమారు 200 ఎకరాల్లో పంట నష్టం..
మల్లికార్జునగిరి, బిల్‌కల్ గ్రామాలలో 80 ఎకరాల్లో ఉల్లి, 30 ఎకరాల్లో జొన్న, 40 ఎకరాల్లో మొక్కజొన్న, మరో 50 ఎకరాల్లో కూరగాయలు, మామిడి తోటలకు నష్టం వాటిల్లి ఉంటుందని ప్రాథమిక అంచన వేసినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి తెలిపారు. పంటలు పరిశీలించిన అనంతరం మర్పల్లి వ్యవసాయ మార్కెట్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం అంచన వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపితే స్పీకర్ ప్రసాద్‌కుమార్ దృష్టికి తీసుకుపోయి పంట నష్టం జరిగిన ప్రతీ రైతుకు ఎకరాకు రూ.10వేలు అందేవిధంగా కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ వైస్ చైర్మన్ మల్లేశ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాములుయాదవ్, ఏఓ శ్రీకాంత్, ప్రభాకర్‌రెడ్డి, మల్లికార్జునగిరి అశోక్, ప్రమోధ్ తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి