
కలిసి నడుద్దాం
సేంద్రియ సాగులో
శంకర్‌పల్లి: వ్యవసాయంలో రసాయనాల వాడకం మానేసి, సేంద్రియ సాగువైపు దృష్టి సారించాలని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ సూచించారు. గ్రామాల్లో సురాజ్యం, అభివృద్ధి, ప్రగతి రావాలని, అందుకు అనుగుణంగా ప్రజలు, ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని ఆకాంక్షించారు. శంకర్‌పల్లి పట్టణంలోని ఓ ప్రైవేటు గార్డెన్స్‌లో శుక్రవారం రంగారెడ్డి– వికారాబాద్ జిల్లాలకు సంబంధించి ‘ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్’ (ఈజీవీఎఫ్) ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఏర్పాటు చేసిన ‘ప్రకృతి– సేంద్రియ రైతు సమ్మేళనం’ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం పలువురు తయారు చేసిన వ్యవసాయ యంత్రాలను పరిశీలించారు. రైతులకు ఉపయోగకరంగా, సులభతరంగా ఉండే వ్యవసాయ పరికరాలను తయారు చేసే పలువురిని సన్మానించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. గ్రామాల్లోని రైతుల్లో చైతన్యం నింపి, వారిని సేంద్రియ వ్యవసాయం వైపు నడిపించే విషయంలో తనవంతు సాయం ఉంటుందన్నారు. రసాయనాల వాడకంతో భూమి ఆరోగ్యం విషతుల్యంతో పాటు, మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉందన్నారు. రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించేందుకు ఈజీవీఎఫ్ ముందుకు రావడం అభినందనీయని కొనియాడారు. సైంటిస్టులు, పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి, నూతన ఆవిష్కరణలు చేసి, సేంద్రియ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని సూచించారు.
ఆకర్షించిన ఆసు యంత్రం
యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన చింతకింది మల్లేశం తయారు చేసిన ఆసు యంత్రం సమ్మేళనానికి వచ్చిన వారిని విశేషంగా ఆకట్టుకుంది. చేనేత కార్మికులు చీర తయారు చేసేందుకు పాత యంత్రాల మీద చేతులతో చేస్తూ, ఎంతో ఇబ్బంది పడేవారు. తన ఇంట్లో తన తల్లి పడే కష్టాన్ని చూసిన మల్లేశం ఒక ఆసు యంత్రాన్ని తయారు చేశాడు. దీంతో మనుషులు లేకుండానే ఆసు పోస్తున్నారు. పెద్ద పెద్ద డిజైన్ల చీరలకు 40 పిన్నులతో ఆసు పోసే వారని, తాను తయారు చేసిన యంత్రం ద్వారా 120 పిన్నులతో ఆసు పోసుకోవచ్చని మల్లేశం స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత కార్యకారిణి సదస్సులు భాగయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఈజీవీఎఫ్ చైర్మన్ వెంకటేశ్వరరావు, పద్మశ్రీ సుభాష్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ