
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
కుల్కచర్ల: విద్యుదాఘాతంతో కౌలు మృతిచెందిన సంఘటన కుల్కచర్ల మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంరెడ్డిపల్లికి చెందిన కుమ్మరి చిన్నస్వామి(74) తన పొలంతో పాటు ముజాహిద్‌పూర్ గ్రామంలో మరింకొంత పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో ఆదివారం రాత్రి పొలం వద్దకు వెళ్లి తిరిగిరాలేదు. అతడి భార్య పార్వతమ్మ విషయా న్ని కొడుకు వెంకటేశ్‌కు చెప్పింది. దీంతో చేను వద్దకు వెళ్లి చూడగా.. స్టార్టర్ డబ్బా వద్ద వరి పొలంలో పడిపోయి మృతిచెందాడు. బల్బ్ వెలిగించేందుకు తీగలు పెట్టే క్రమంలో విద్యుదాఘాతానికి గురైనట్లు భావిస్తున్నారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అన్వేష్‌రెడ్డి తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకుని ధైర్యం చెప్పారు. అంత్యక్రియల కోసం ఆర్థిక సాయం అందజేశారు.
బాటకు అడ్డంగా కంపవేశారని కేసు
కొందుర్గు: బాటకు అడ్డంగా కంపచెట్లు వేశారని నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ రవీందర్‌నాయక్ తెలిపిన ప్రకారం.. టేకులపల్లి గ్రామానికి చెందిన బేగరి రాజు, మహేష్, లక్ష్మయ్య, పాండు ఈ నెల 5న గ్రామం నుంచి ఉత్తరాసిపల్లి మార్గంలో గ్రామం నుంచి షాబాద్ వెళ్లే దారికి అడ్డంగా ముళ్ల కంప వేశారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి మల్లేష్ ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా పొలానికి వెళ్లే బాటను కొందరు వ్యక్తులు ఆక్రమించి బాటను బంద్ చేశారని, ఈ విషయమై తాము తహసీల్దార్, ఆర్‌డీఓకు విన్నవించుకున్నా పలితంలేక కంపచెట్లు వేశామని, ఇలాగైనా తమ సమస్య తీర్చుతారేమోనని ఆశించి బాటకు అడ్డంగా ముళ్లకంపను వేశామని నిందితులు రాజు తెలిపారు.