
పత్తి రైతుకు విత్తన భారం!
ఏటా పెరుగుతున్న ధరలు
ఎకరానికి మూడు ప్యాకెట్లు
కొడంగల్: ఏటా పత్తి విత్తనాల ధరలు పెరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాతావరణం అనుకూలించక దిగుబడి తగ్గడం, మద్దతు ధర రాక పోవడం, సాగు ఖర్చులు అమాంతం పెరిగి భారీ నష్టాలను చవిచూస్తున్నారు. వీటికి తోడు విత్తనాల ధరలు పెరగడం రైతులను మరింత కుంగదీస్తోంది. జిల్లా వ్యాప్తంగా కంది, వరి, పత్తి, జొన్న, పెసర, మినుము, వామ పంటలను విస్తారంగా సాగు చేస్తున్నారు. ప్రధానంగా వరి, కంది, పత్తి పంటలు సాగు చేయడానికి రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో రైతులు పొలాలను దుక్కి దున్ని చదును చేస్తున్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి పొలాలను సాగుకు సిద్ధం చేస్తారు. ఆరుగాలం కష్టించి పని చేసే రైతులకు ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. ప్రస్తుతం మార్కెట్‌లో పత్తి విత్తనాల ధరలు పెరుగుతున్నాయి. రాష్ట్రంలో బీటీ రకం పత్తి విత్తనాలకు డిమాండ్ ఉంది. ఈ రకం విత్తనాలు మంచి దిగుబడి ఇవ్వడంతో ఇతర సమస్యలను తట్టుకుంటుందని రైతులు భావిస్తున్నారు. గతంలో ఒక ప్యాకెట్ బీటీ పత్తి విత్తనాలు(475 గ్రాములు) రూ.760 ఉండగా ప్రస్తుతం రూ.900కు చేరింది.
తప్పని కష్టాలు
మార్కెట్లో పెరిగిన ధరల వల్ల రైతులకు కష్టాలు తప్పడం లేదు. విత్తనాలు నాటింది మొదలు పత్తి దిగుబడి చేతికొచ్చి విక్రయించే వరకు ఇక్కట్లు తప్పడం లేదు. వర్షాకాలం సీజన్ ప్రారంభానికి ముందే పత్తి విత్తనాల కంపెనీలు ధరలను పెంచాయి. దీంతో రైతులపై ఆర్థిక భారం మరింత పెరగనుంది. పెరిగిన సాగు ఖర్చులు.. విత్తనాల ధరల వల్ల ఈ ఏడాది రైతులు పత్తి సాగుకు మొగ్గు చూపుతారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనికితోడు నకిలీ విత్తనాల బెడద పెరిగింది. తక్కువ ధరకు నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి రైతులు పంట దిగుబడి రాక నష్టపోతున్నారు.
పెరుగుతున్న సాగు ఖర్చులు
ఏటా సాగు ఖర్చులు పెరుగుతున్నాయి. దీనికితో డు విత్తనాలు, పురుగు మందులు, కూలీల వేతనా లు కలిపి రూ.వేలల్లో పెట్టుబడులు అవుతున్నాయి. కూలీల రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నా యి. ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు కలుపుతీత కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది.
సాగు ఖర్చులు కూడా అదే స్థాయిలో..
అన్నదాతలపై ఆర్థిక భారం
జిల్లాలో 60వేల ఎకరాల్లో పంటల సాగు
సబ్సిడీపై అందజేయాలని వేడుకోలు
జిల్లాలో కంది, వరి తర్వాత అధిక విస్తీర్ణయంలో సాగు చేసేది పత్తి ఒక్కటే. ఎకరాకు మూడు ప్యాకెట్టు చొప్పున విత్తనాలను విత్తు కోవాల్సి ఉంటుంది. ఒక్కో ప్యాకెట్ 475 గ్రాములు ఉంటుంది. ఇందులో 450 గ్రాములు బీటీ విత్తనాలు, 25 గ్రాములు నాన్ బీటీ విత్తనాలు ఉంటాయి. రైతులు బీటీ విత్తనాల వైపే మొగ్గు చూపుతున్నారు.
ఐదేళ్లలో పెరిగిన
పత్తి విత్తనాల (ప్యాకెట్) ధరలు ఇలా..
2021 రూ.760
2022 రూ.810
2023 రూ.840
2024 రూ.850
2025 రూ.900
రైతులను ఆదుకోవాలి
ఏటా సాగు ఖర్చులు పెరు గుతున్నాయి. విత్తనాలు, ఎరువుల ధరలను ప్రభు త్వం తగ్గించి రైతులను ఆ దుకోవాలి.విత్తనాల ధరలు పెరగడం వల్ల మార్కెట్‌లోకి నకిలీ విత్తనాలు వస్తున్నాయి. ధర తక్కువగా ఉందని రైతులు వాటిని కొనుగోలు చేసి మోసపోతున్నారు. నకిలీ విత్తనాలు మార్కెట్‌లోకి రాకుండా చర్యలు తీసుకోవాలి. పంటలకు ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించాలి.
– అంజిలప్ప, రైతు, గుండ్లకుంట

పత్తి రైతుకు విత్తన భారం!