
బ్లాక్ ప్లాంటేషన్‌ను పరిశీలించిన అధికారులు
నవాబుపేట: మండల పరిధిలోని నారెగూడ గ్రామం సర్వే నంబర్ 153లో నాలుగేళ్ల క్రితం హరితహారంలో భాగంగా బ్లాక్‌ప్లాంటేషన్ కింద 8వేల మొక్కలు నాటారు. వీటి చుట్టూ గడ్డి ఏపుగా పెరిగింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పంటించడంతో మొక్కలు కాలిబూడిదయ్యాయి. ఈ విషయాన్ని ‘సాక్షి’దినపత్రికలో మంగళవారం ‘అగ్నికి ఆహుతైన బ్లాక్ ప్లాంటేషన్’ శీర్షికన వెలుగులోకి తెచ్చింది. ఇందుకు స్పందించిన అధికారులు ఎంపీఓ విజయ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి శోభ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. అనంతరం ఎంపీఓ మాట్లాడుతూ.. కాలిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటుతామన్నారు. ఏపుగా పెరిగిన మొక్కలకు నీరందిస్తే బ్రతికే అవకాశం ఉందన్నారు. ఉపాధి హామీ సిబ్బందితో నీరు అందిస్తున్నామని చెప్పారు.
మూడు ఇసుక ట్రాక్టర్లు సీజ్
బొంరాస్‌పేట: మండల పరిధిలోని మహంతీపూర్ వాగు నుంచి అక్రమంగా తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున పట్టివేశారు. అక్రంగా ఇసుకను తరలిస్తున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు ఎస్‌ఐ రవూఫ్, కానిస్టేబుళ్లు మండల పరిధిలోని రేగడిమైలారం వద్ద మహంతీపూర్‌కు చెందిన బందెయ్య, మహేందర్, అంజి ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేశౠరు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
కేసు నమోదు
బొంరాస్‌పేట: మండల పరిధిలోని ఎన్కేపల్లిలో సోమవారం మనస్తాపంతో వ్యక్తి బలవన్మరణం చేసుకున్న విషయం విదితమే. ఈ ఘటనపై మంగళవారం మృతుడి అన్న ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ రవూఫ్ తెలిపారు. తన తమ్ముడికి తల్లిదండ్రులు లేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని కొడంగల్‌కు చెందిన నడిమింటి కిష్టప్ప ఫిర్యాదు చేశారన్నారు. మృతుడి భార్య, తన మరదలు నర్సమ్మ, ఇతరుల ప్రమేయం లేదన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో కుటుంబ పోషణ భారంగా ఉందని తరచుగా మల్కప్ప మనస్తాపానికి గురయ్యేవాడని చెప్పారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.
మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్
మాడ్గుల: నిబంధనలకు విరుద్ధంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు సీజ్ చేశారు. సీఐ వేణుగోపాల్ రావు తెలిపిన ప్రకారం.. మంగళవారం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. మండల పరిధిలోని అందుగుల శివారు నుంచి ట్రాక్టర్‌లో మట్టి తరలిస్తున్నారు. పోలీసులు వాహనాన్ని నిలిపి పత్రాలు పరిశీలించారు. ఎటువంటి అనుమతులు లేకపోవడంతో ట్రాక్టర్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్ వాహన యజమానిపై కేసు నమోదు చేశామన్నారు.
వైన్స్‌లో చోరీ
యాచారం: ఓ వైన్స్ దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తులు రూ.30 వేల నగదు చోరీ చేశారు. వివరాలు.. మండల కేంద్రంలోని నందివనపర్తి రోడ్డులో లక్కీవైన్స్ యజమానులు సోమవారం రాత్రి షాప్‌నకు తాళాలు వేసి ఇంటికి వెళ్లారు. మంగళవారం వైన్స్ వద్దకు వచ్చి చూడగా షటర్లు పగులగొట్టి ఉన్నాయి. గల్లాపెట్టెలోని రూ.30 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యా దు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తి బలవన్మరణం
కొందుర్గు: కుటుంబ సమస్యల కారణంగా తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండల పరిధిలోని గంగన్నగూడలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ రవీందర్‌నాయక్ తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన చింతకింది రాములు(35)కు 12 ఏళ్ల కిత్రం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన కవితతో వివాహమైంది. వీరికి కుమారుడు, కూతురు సంతానం. పది రోజుల క్రితం కుమారుడు అస్వస్థతకు గురవ్వడంతో కవిత పిల్లలను తీసుకుని పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో రాములుకు వ్యవసాయంలో నష్టం రావడం, కుమారుడి ఆరోగ్యం బాగులేకపోవడం, భార్య పుట్టింటికి వెళ్లడంతో తాగుడుకు బానిసయ్యాడు. మనస్తాపానికి గురై సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం రాములు గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపు తట్టిచూడగా అప్పటికి ఉరేసుకుని మృతి చెందియున్నాడు. మృతుడి తండ్రి కృష్ణయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బ్లాక్ ప్లాంటేషన్‌ను పరిశీలించిన అధికారులు