
లింగ నిర్ధారణ చేస్తే క్రిమినల్ కేసులు
● డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరవణ
అనంతగిరి: అనుమతులు లేకుండా ఆస్పత్రులు, డయోగ్నస్టిక్ సెంటర్లు, లాబోరేటరీలు నిర్వహిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరవణ హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని ఈశా హాస్పిటల్, అనంత్ హాస్పిటల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కానింగ్ యంత్రాలు, రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రి యాజమాన్యం, గైనకాలజిస్టులతో మాట్లాడారు. స్కానింగ్ అనేది బిడ్డ, తల్లి ఆరోగ్య పరిరక్షణ కోసం మాత్రమే చేయాలన్నారు. లింగ నిర్ధారణ కోసం చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైద్యులపై క్రిమినల్ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లను తనిఖీలు చేసి పీఎన్‌డీటీపోర్టల్‌లో వివరాలు అప్‌లోడ్ చేయడం జరుగుతుందన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా నిర్వహిస్తున్న మెడికేర్ డయోగ్నస్టిక్ సెంటర్‌కు నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం జిల్లా వైద్య శాఖ కార్యాలయంలో 15మంది స్టాఫ్ నర్సులకు నియామకపత్రాలు అందించడం జరిగిందన్నారు. ఈ నియామకాలు అన్ని కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ విధానం ప్రకారం కమిటీ ఆమోదం పొందిన అనంతరం పారదర్శకంగా చేపట్టడం జరిగిందన్నారు.