
రెవెన్యూ గ్రామంగా ప్రకటించాలని వినతి
బంట్వారం: మండలంలోని బస్వాపూర్‌ను రెవెన్యూ గ్రామంగా ప్రకటించాలని స్థానిక నాయకులు గురువారం కలెక్టర్ ప్రతీక్ జైన్‌ను బంట్వారంలో కలిసి వినతిపత్రం అందజేశారు. రెవెన్యూ గ్రామంగా బస్వాపూర్ లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. స్పందించి వెంటనే ప్రకటించాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం అందజేసిన వారి లో కాంగ్రెస్ నాయకులు మోహన్‌రెడ్డి, నర్సింలు, రాములు, పురుషోత్తం ఉన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో సమావేశం
తాండూరు రూరల్: ఇందిరమ్మ ఇళ్లు కట్టుకుంటే ప్రభుత్వం నుంచి బిల్లులు ఇప్పిస్తామని కోట్‌పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నారాయణరెడ్డి అన్నారు. గురువారం పెద్దేముల్ మండలం మంబాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పాఠశాల ఆవరణలో ప్రత్యేక సమావేశం నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంబాపూర్ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారన్నారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కృషితో గ్రామంలో 328 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారని చెప్పారు. ఇంటి నిర్మాణంలో దళారులను నమ్మోద్దని.. ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లిస్తారని చెప్పారు. అనంతరం హౌసింగ్ డీఈఈ ఖలీమోద్దీన్ మట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనాల ప్రకారం ఇళ్లు కట్టుకుంటే బిల్లులు వస్తాయన్నారు. ఇప్పటి వరకు 21 ఇళ్లకు మార్కింగ్ వేశామన్నారు. త్వరలో వారికి బేస్‌మెంట్ బిల్లులు చెల్లిస్తామన్నారు. గతంలో ఫొటో దిగిన స్థలంలోనే ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రతన్‌సింగ్, ఏఈ రహీం, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు మైవూఫ్, పంచాయతీ కార్యదర్శి సంజీవ్ లబ్ధిదారులు పాల్గొన్నారు.
వివాద భూమిలో
సెక్షన్ 164 విధింపు
ఆర్డీఓ సూచనతో తహసీల్దార్ ప్రకటన
తుర్కయంజాల్: ఇరువర్గాల ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న కమ్మగూడ, తుర్కయంజాల్ రెవెన్యూ పరిధిలో బీఎన్‌ఎస్‌ఎస్ కింద సెక్షన్ 164 అమలు చేయాలని ఇబ్రహీంపట్నం ఆర్డీఓ కె.అనంత్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ సుదర్శన్‌న్‌రెడ్డి ప్రకటించారు. గురువారం స్థానిక కల్యాణ వెంకటేశ్వరస్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సర్వే నంబర్ 240, 241, 242లోని 10.09 ఎకరాల భూమి తమదంటే తమదేనని ఇరు వర్గాలు వరుసగా గొడవలకు దిగుతుండటంతో బుధవారం లా అండ్ ఆర్డర్ అదుపు తప్పినట్లు గుర్తించామని చెప్పారు. ఇలాంటి సంఘటనలు మరోసారి చోటు చేసుకునే ప్రమాదం పొంచి ఉండటంతో సెక్షన్ 164 విధించినట్లు ఆయన తెలిపారు. ప్లాట్లు, భూమి యజమానులతో పాటు, కోర్టు నుంచి ఆర్డర్ పొందిన వారు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదని హెచ్చరించారు. దీన్ని ఉల్లఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని పేర్కొన్నారు. కార్యక్రమంలో వనస్థలిపురం సీఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్మినేడులో వడగళ్ల వాన
ఇబ్రహీంపట్నం రూరల్: ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వాన గురువారం సాయంత్రం ఇబ్రహీంపట్నం మండలం ఎల్మినేడు గ్రామంలో కురిసింది. భారీ ఉరుములతో వడగళ్లు పడగా.. ఓ ఇంటిపై పిడుగుపడి రేయిలింగ్ కూలిపోయిందని గ్రామస్తులు తెలిపారు.

రెవెన్యూ గ్రామంగా ప్రకటించాలని వినతి