
గిరిజన రైతులకు న్యాయం జరిగేలా చూస్తాం
యాచారం: ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి శుక్రవారం నక్కర్తమేడిపల్లి రెవెన్యూ పరిధిలో పర్యటించారు. ఏళ్లుగా కబ్జాలో ఉన్న పల్లెచెల్కతండా గిరిజనులకు ఆ భూములపై పరిహారం అందకపోవడంతో గురువారం సర్వే, ఫెన్సింగ్ పనులను అడ్డుకోవడం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్డీఓ అనంత్‌రెడ్డి తహసీల్దార్ అయ్యప్పతో కలిసి సర్వేనంబర్ 184లో పర్యటించారు. ఎన్నేళ్లుగా కబ్జాలో ఉంటున్నారు, గతంలో పరిహారం ఎందుకు రాలేదు, దరఖాస్తు చేసుకోలేదా.. అధికారులు రాలేదా అని ఆరా తీశారు. కబ్జాలో నిజంగా ఎంతమంది రైతులు ఉన్నారని అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ నారాయణరెడ్డి, టీజీఐఐసీ అధికారులతో మాట్లాడి కబ్జాలో నిజమైన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తాడిపర్తిలో పనులను అడ్డుకున్న రైతులు
తాడిపర్తిలో శుక్రవారం ఫార్మాసిటీ భూముల సర్వే, ఫెన్సింగ్ పనులను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు. 104 సర్వే నంబర్‌లో కబ్జాలో ఉన్న రైతులకు పరిహారం అందజేసే వరకు ఆందోళన నిర్వహిస్తామని.. సర్వే, ఫెన్సింగ్ పనులను అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. సమాచారం అందుకున్న గ్రీన్ ఫార్మాసిటీ సీఐ కృష్ణంరాజు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి సముదాయించారు. విషయాన్ని ఆర్డీఓ అనంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా బుధవారం వచ్చి వివరాలు తెలుసుకుంటానని చెప్పడంతో రైతులు శాంతించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి