
తాండూరు వ్యవసాయ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో వ్యాపారం
తాండూరు టౌన్: తాండూరు వ్యవసాయ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో వ్యాపారం జరిగింది. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌కు ఫీజు రూపంలో రూ.6.77 కోట్ల ఆదాయం సమకూరింది. మార్కెటింగ్ శాఖ ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించడంలో అధికారులు సక్సెస్ అయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోనే అతిపెద్దగా తాండూరు వ్యవసాయ మార్కెట్‌కు పేరుంది. నియోజకవర్గంతోపాటు ఇతర ప్రాంతాల రైతులు పండించిన కంది, పత్తి, శనగ, పెసర, మినుము, వేరుశనగ, వరి ధాన్యం, మక్కలు, సో యాబిన్, కుసుమ పంట ఉత్పత్తులను ఇక్కడికి తెచ్చి క్రయ విక్రయాలు నిర్వహిస్తుంటారు. మార్కెటింగ్ శాఖ ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేసిన అధికారులు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల ప్రశంసలు పొందారు.
పోటెత్తిన కంది ఉత్పత్తులు
తాండూరు నియోజకవర్గంలో కంది పంట బాగా పండింది. దీంతో ఉత్పత్తులు మార్కెట్‌కు పోటెత్తాయి. గత సీజన్(2023–24)లో 74,858 క్వింటాళ్ల దిగుబడి రాగా రూ.65.75 కోట్లు వ్యాపారం జరిగింది. మార్కెట్‌కు ఒక్క శాతం ఫీజు రూపంలో 65.75 లక్షల ఆదాయం సమకూరింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌కు 1,36,718 క్వింటాళ్ల కంది ఉత్పత్తులు వచ్చాయి. రూ.98.43 కోట్ల వ్యాపారం జరగ్గా మార్కెట్‌కు రూ.98.43 లక్షల ఆదాయం సమకూరిందని మార్కెట్ కమిటీ సెక్రెటరీ శ్రీనివాస్, సూపర్‌వైజర్ హబీబ్ అల్వీలు తెలిపారు. ఇది కేవలం కంది పంట క్రయవిక్రయాల ద్వారా వచ్చిన ఆదాయని వారు తెలిపారు.
తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం
ఫీజు రూపంలో భారీగా సమకూరిన నిధులు
గతేడాది కంటే అధికంగా వచ్చిన కంది ఉత్పత్తులు