
జోరుగా పొలం పనులు
కొడంగల్: నియోజక వర్గంలో వ్యవసాయ పనులు జోరుగా సాగుతున్నాయి. రైతులు ఖరీఫ్ సీజన్‌లో విత్తనాలు వేయడానికి పొలాలను సిద్ధం చేస్తున్నారు. ఎద్దు.. ఎవుసం కనుమరుగు కావడంతో యంత్రాలతో దుక్కులు దున్నుతున్నారు. కొడంగల్, దౌల్తాబాద్, బొంరాస్‌పేట, దుద్యాల మండలాల్లో అధిక మొత్తంలో నల్లరేగడి భూములు ఉన్నాయి. కొన్ని చోట్ల ఎర్ర నేలలు, చెల్కలు ఉన్నాయి. ఖరీఫ్‌లో ఎక్కువ భాగం కంది, పత్తి, జొన్న, పెసర, మినుము పంటలు వేయడానికి పొలాలను చదును చేస్తున్నారు. ఈ ప్రాంతంలో రైతులు వర్షాధార పంటలపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు.
వైభవంగా మౌనేశ్వర స్వామి వార్షికోత్సవం
దుద్యాల్: మండల కేంద్ర సమీపంలోని గుట్టపై వెలసిన మౌనేశ్వర స్వామి వార్షికోత్సవాన్ని శనివారం వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే నిర్వాహకులు ఆలయాన్ని ముస్తాబు చేశారు. రెండు రోజులు సాగే ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు స్వామి వారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రత్యేక భజన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మోనయ్య పంతులు మాట్లాడుతూ పది సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ప్రత్యేక హోమంతో పాటు అన్నదానం ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
జార్జిరెడ్డి వర్ధంతి సభలు
జయప్రదం చేయాలి
పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్
అనంతగిరి: ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ విద్యార్థి నాయకుడు, కామ్రెడ్ జార్జిరెడ్డి 53వ వర్ధంతి సభలను విజయవంతం చేయాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, కార్యదర్శి రాజేశ్ కోరారు. ఈ మేరకు శనివారం వికారాబాద్‌లో ఆ సంస్థ ఆధ్వర్యంలో శనివారం వాల్‌పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వర్ధంతిని పురస్కరించుకుని ఆయన అమరత్వాన్ని విషాద జ్ఞాపకంగా కాకుండా మరో పోరాటానికి ఉత్తేజంగా మలుచుకోవాలన్నారు. అందుకోసమే ప్రత్యేక సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. అణగారిన విద్యార్థుల పక్షాన ఉండి పోరాటం చేసిన మహాయోధుడన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీకాంత్, సురేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
షార్ట్ సర్క్యూట్‌తో
షాపు దగ్ధం
మీర్‌పేట: వుడ్ వర్క్స్ షాపులో షార్ట్ సర్క్యూట్ జరిగి విలువైన సామగ్రి అగ్నికి ఆహుతైన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నాగరాజు కథనం ప్రకారం.. బడంగ్‌పేట వెంకటాద్రి కాలనీకి చెందిన కంచర్ల గౌరీశంకర్ దావుద్‌ఖాన్‌గూడలో సిసిరా వుడ్ వర్క్స్ పేరిట షాపు నిర్వహిస్తున్నారు. రోజు మాదిరిగా శుక్రవారం రాత్రి షాపును మూసివేగా షార్ట్ సర్క్యూట్‌తో రూ.20 లక్షల విలువైన సామగ్రి, షెడ్డు పూర్తిగా దగ్ధమైంది.

జోరుగా పొలం పనులు

జోరుగా పొలం పనులు