
వేసవి భత్యానికి మంగళం!
దోమ: ఎండలో పనిచేసే ఉపాధి కూలీలకు చెల్లించాల్సిన వేసవి భత్యానికి నాలుగేళ్లుగా బ్రేక్ పడింది. ప్రభుత్వం గతంలో ఏటా వేసవి భత్యం అందించడంతో పాటు, ఇతర సౌకర్యాలు కల్పించేది. కానీ ప్రస్తుతం అలాంటివేవీ కనిపించడం లేదు. ఈ అంశంపై సంబంధిత అధికారులకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతో భత్యానికి ఈసారి కూడా మంగళం పాడినట్లేనని తెలుస్తోంది.
కొరవడిన స్పష్టత..
గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా పల్లె ప్రజలకు స్థానికంగా పని కల్పిస్తూ భరోసా అందిస్తోంది. దోమ మండల వ్యాప్తంగా 36 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 11,725 ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉండగా, 13,971 మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం మండలంలో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులకు 3,790 మంది కూలీలు హాజరవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వేసవిలో ఉపాధి హామీ కూలీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఫిబ్రవరి నుంచి జూన్ నెల వరకు ఐదు నెలల పాటు వారి వేతనానికి అదనంగా 25 నుంచి 30శాతం వేసవి భత్యం చెల్లించేది. కానీ గత నాలుగేళ్లుగా ఇది నిలిచిపోయింది.
సౌకర్యాల లేమితో ఇబ్బందులు..
గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే కూలీలకు పని ప్రదేశంలో సౌకర్యాలు కరువయ్యాయి. కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతుండటంతో మండుటెండల్లో పనిచేస్తున్న కూలీలు అల్లాడిపోతున్నారు. పని చేస్తున్న చోట కనీసం మంచినీరు, మజ్జిగ, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, టెంట్లు, అందుబాటులో ఉండటం లేదు. గత ప్రభుత్వాలు కూలీలకు టెంట్లు, మంచినీరు, గడ్డపారలు, పారలతో పాటు ఇతర పనిముట్లను అందించేంది. కానీ పదేళ్లుగా ప్రభుత్వం ఎలాంటి పరికరాలను అందించడం లేదు. తామే స్వయంగా ఇంటి వద్ద నుంచి పని ముట్లు, నీళ్ల బాటిళ్లు తీసుకుని వెళ్లాల్సి వస్తోందని కూలీలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ఉపాధి కూలీలకు అందని అదనపు డబ్బులు
నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి
పని ప్రదేశాల్లో వసతుల కరువు