
ఎయిర్ బ్రేక్ ఫెయిల్..
● మొరాయించి ఆర్టీసీ బస్సు
● భయాందోళనకు గురైన ప్రయాణికులు
దోమ: ఎయిర్ బ్రేక్‌లు ఫెయిల్ కావడంతో ఓ ఆర్టీసీ బస్సు మొరాయించింది. శనివారం పరిగి డిపోకు చెందిన బస్సు దోమ మండల కేంద్రం మీదుగా ఆయా గ్రామాలకు వెళ్లేందుకు వస్తుంది. దోమ సమీపంలోకి రాగానే ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా బస్సు ఎయిర్ బ్రేక్‌లు ఫెయిల్ అయ్యాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును సురక్షితంగా ఆపేశారు. సుమారు 40 మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తున్నారని, ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారని వారు పేర్కొన్నారు. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును ఆపేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు.
కాలం చెల్లిన బస్సులను తొలగించండి
ఆర్టీసీలో కాలం చెల్లిన బస్సులను వెంటనే తొలగించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి బస్సులతో అనుకోని ప్రమాదం సంభవిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సులో భద్రత ఉంటుందని గొప్పలు చెబుతున్నారే కానీ, కాలం చెల్లిన బస్సులతో సంభవించే ప్రమాదాలను గుర్తించలేకపోతున్నారని చెబుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికై న అధికారులు కాలం చెల్లిన బస్సులను తొలగించి నూతన బస్సులను నడిపించేలా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రయాణికులు కోరుతున్నారు.