
త్వరలో ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితా
కలెక్టర్ ప్రతీక్ జైన్
అనంతగిరి: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల రెండో జాబితా లబ్ధిదారుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు మండల స్థాయి అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి, మే 2న గ్రామ పంచాయతీ, వార్డు కార్యాలయాల్లో జాబితాను ప్రదర్శిస్తారని తెలిపారు. మే 5న అర్హులైన వారికి ఇళ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. మొదటి విడత పైలెట్ గ్రామాల్లో పునాది పనులు పూర్తి చేసుకున్నవారికి రూ.లక్ష చొప్పున వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. నాలుగు విడతలుగా రూ.5 లక్షలు అందుతాయని తెలిపారు. మొదటి విడతలో 2,285 మంది లబ్ధిదారులను గుర్తించామని.. 340 ఇళ్లకు మార్కింగ్ చేసినట్లు తెలిపారు. 45 మంది బేస్మెంట్ పనులు పూర్తి చేశారని.. 26 మందికి రూ.లక్ష చొప్పున సీఎం రేవంత్‌రెడ్డి అందజేశారని పేర్కొన్నారు. మిగిలిన వారికి త్వరలో డబ్బులు అందుతాయని కలెక్టర్ తెలిపారు.