
సాక్షి, విశాఖపట్నం : సహజ అందాలతో అలరారే ఉత్తరాంధ్ర పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కేందుకు సరికొత్త ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఒకవైపు సాగర సోయగాలు.. మరోవైపు ఎత్తైన తూర్పు కనుమల అందాలు ప్రపంచ పర్యాటకులను కట్టిపడేస్తుండగా.. ప్రపంచ పర్యాటక పటంలో టూరిజం రాజధానిగా భాసిల్లే విధంగా ప్రాజెక్టులకు ఇటీవల విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందుకు అవసరమైన భూములను ఆయా ప్రాజక్టులకు అప్పగించేందుకు టూరిజం శాఖ కసరత్తు ప్రారంభించింది. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ఉన్న పర్యాటక భూముల పరిధిని విశాఖ హబ్‌గా ఏర్పాటు చేస్తూ.. ఆయా ప్రాజెక్టుల డీపీఆర్‌లకు అనుగుణంగా భూ కేటాయింపులు చేసేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా జిల్లాలో ఉన్న అపార అవకాశాలను మెరుగు పరుచుకొని పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పనులకు రూపకల్పన జరుగుతోంది. విశాఖ జిల్లానూ పర్యాటక ఖిల్లాగా మార్చే దిశగా.. టూరిజం ప్రాజెక్టులకు కసరత్తు చేస్తున్నారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖలో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో జరిగిన పర్యాటక ఒప్పందాల్లో సింహభాగం ఇన్వెస్టర్లు విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలను ఎంపిక చేసుకున్నారు. ఉమ్మడి విశాఖతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పర్యాటక అవకాశాలు పుష్కలంగా ఉన్న ప్రతి ప్రాంతంలోనూ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు వివిధ సంస్థలు ముందుకొచ్చాయి. జీఐఎస్‌లో పర్యాటక రంగానికి సంబంధించి రూ.8,806 కోట్లతో 64 ప్రాజెక్టులు ఉత్తరాంధ్రకు రానున్నాయి.
భూ బదలాయింపు ప్రక్రియ షురూ
విశాఖ హబ్ పరిధిలో 39 పార్శిళ్లలో 427.08 ఎకరాలున్నట్లుగా గుర్తించారు. ఇందులో ఎక్కువ మొత్తం భూములు ఇంకా బదలాయింపునకు నోచుకోలేదు. ఈ ప్రక్రియను టూరిజం శాఖ ప్రారంభించింది. ఆయా జిల్లాల కలెక్టర్లకు రెవెన్యూ పరిధిలో ఉన్న పర్యాటక భూముల బదలాయింపు వేగవంతం చేయాలని టూరిజం అధికారులు లేఖలు రాశారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫైల్స్ ఆయా మండల తహశీల్దారుల పరిధిలో ఉన్నాయి. వీటిని త్వరగా క్లియర్ చేయాలంటూ కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయనున్నారు. భూ బదలాయింపు ప్రక్రియ పూర్తయ్యేలోపు.. ఎంవోయూలు చేసుకున్న పెట్టుబడిదారుల నుంచి కూడా ఫైల్స్ కదిలేలా చేస్తున్నారు. ఏర్పాటు చేయనున్న ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌తో పాటు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ యూనిట్(పీఎంయూ) కూడా అందించాలంటూ ఎంవోయూలు చేసుకున్న సంస్థలకు పర్యాటక శాఖ ఉన్నతాధికారులు మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ డీపీఆర్, పీఎంయూలు అందితే.. మరోవైపు బదలాయింపు ప్రక్రియ పూర్తయితే.. ఏ ప్రాజెక్టుకు ఏ ల్యాండ్ అవసరమవుతుందనే దానిపై నిర్ణయించి.. ఆయా సంస్థలకు కేటాయింపులు చేపట్టే ప్రక్రియను ప్రారంభించనున్నారు.
సరిహద్దులు గుర్తింపునకు రోవర్ సర్వే
మరోవైపు.. భూముల బదలాయింపు పూర్తయిన తర్వాత.. పర్యాటక భూముల సరిహద్దులను గుర్తించేందుకు సర్వే నిర్వహించనున్నారు. దీనిపై కలెక్టర్ డా.మల్లికార్జున ఆదేశాల మేరకు విశాఖపట్నం, భీమిలి ఆర్డీవోతో టూరిజం రీజినల్ డైరెక్టర్ శ్రీనివాస్ పాణి భేటీ అయ్యారు. డ్రోన్ సర్వేకు అనుమతులు లేని కారణంగా రోవర్స్ సర్వే నిర్వహించి హద్దులు గుర్తించనున్నారు. ప్రస్తుతం రోవర్స్ విజయనగరం జిల్లాలో భూహక్కు రీ సర్వేలో ఉన్న కారణంగా వారం రోజుల్లో సర్వే ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పర్యాటక భూముల వివరాలివీ...
విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పరిధిలో 296.15 ఎకరాలు
శ్రీకాకుళం జిల్లాలో 32.78 ఎకరాలు
విజయనగరం జిల్లాలో 48.8 ఎకరాలు
పార్వతీపురం మన్యం జిల్లాలో6.25 ఎకరాలు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో43.1 ఎకరాలు
మొత్తం విశాఖ హబ్ పరిధిలో 427.08 ఎకరాలు
Comments
Please login to add a commentAdd a comment