బాడీ కెమెరా
సాక్షి, విశాఖపట్నం: రైళ్లలో హింసాత్మక చర్యలను నిరోధించే లక్ష్యంతో రైల్వే బోర్డు వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. టికెట్ చెకింగ్ సమయంలో వస్తున్న ఆరోపణలు, ప్రయాణికులతో వాగ్వాదాలకు చెక్ చెప్పేలా టికెట్ కలెక్టర్లకు బాడీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే మధ్య రైల్వే జోన్ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్ట్ అమలు చేస్తున్న నేపథ్యంలో.. మిగిలిన జోన్లకు విస్తరించేందుకు సమాలోచనలు చేస్తోంది. త్వరలోనే ఈస్ట్‌కోస్ట్ పరిధిలోని వాల్తేరు డివిజన్‌లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది.
రైలు ప్రయాణంలో టికెట్ తనిఖీలు చేసే సమయంలో ప్రయాణికులతో సిబ్బందికి తరచూ వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో టికెట్ కలెక్టర్లపై ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. వెయిటింగ్ టికెట్ తనిఖీ చేసే సమయం, ఆర్‌ఏసీ ఉన్న ప్రయాణికులకు బెర్త్‌లు కేటాయించే విషయంలోనూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. వీటికి పూర్తిస్థాయిలో చెక్ చెప్పాలని రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ తనిఖీ అధికారులకు బాడీ కెమెరాలు అమర్చుతోంది. పైలట్ ప్రాజెక్టుగా మూడు నెలల కిందట సెంట్రల్ రైల్వే పరిధిలో 50 మంది టికెట్ కలెక్టర్లకు బాడీ కెమెరాలు అమర్చింది. అప్పటి నుంచి ఒక్క ఫిర్యాదు గానీ, ప్రయాణికుల వాగ్వాద సంఘటనలు గానీ నమోదు కాలేదు. దీంతో మిగిలిన జోన్లలోనూ అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది.
ఒక్కో కెమెరా రూ.9 వేలు..
రైల్వే నెట్‌వర్క్ పరిధిలోని అన్ని జోన్లకూ బాడీ కెమెరాలు అందించాలని రైల్వే మంత్రిత్వ శాఖ బోర్డుకు సూచించింది. ఈ నేపథ్యంలో ఈస్ట్‌కోస్ట్ జోన్ పరిధిలో బాడీ కెమెరాలు అందించనున్నారు. ఇందులో భాగంగా వాల్తేరు డివిజన్ పరిధిలో టీసీలకు వీటిని అమర్చనున్నారు. ఒక్కొక్కటి రూ.9,000 విలువైన ఈ బాడీ కెమెరాలు దాదాపు 20 గంటల ఫుటేజీని రికార్డు చేయగలవు. బాడీ కెమెరాలు టికెట్ తనిఖీ సమయంలో ఉద్యోగుల పారదర్శకతను కాపాడుకోవడంలో సహాయపడతాయి. దీంతో పాటు అక్రమ చర్యలను నిరోధించవచ్చు. ఫిర్యాదుల సందర్భంలో, టిక్కెట్ తనిఖీ సమయంలో ఏదైనా వ్యత్యాసాన్ని గుర్తించడంలో కీలక పాత్ర పోషించనున్నాయని వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు చెబుతున్నారు. వృత్తి నైపుణ్యం పెంచడంతో పాటు సిబ్బంది రక్షణకు దోహదపడతాయని అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment