Ticket collectors
-
టికెట్ చెకింగ్‌పై త్రినేత్రం
సాక్షి, విశాఖపట్నం: రైళ్లలో హింసాత్మక చర్యలను నిరోధించే లక్ష్యంతో రైల్వే బోర్డు వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టింది. టికెట్ చెకింగ్ సమయంలో వస్తున్న ఆరోపణలు, ప్రయాణికులతో వాగ్వాదాలకు చెక్ చెప్పేలా టికెట్ కలెక్టర్లకు బాడీ కెమెరాలు ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే మధ్య రైల్వే జోన్ ప్రాంతంలో పైలట్ ప్రాజెక్ట్ అమలు చేస్తున్న నేపథ్యంలో.. మిగిలిన జోన్లకు విస్తరించేందుకు సమాలోచనలు చేస్తోంది. త్వరలోనే ఈస్ట్‌కోస్ట్ పరిధిలోని వాల్తేరు డివిజన్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. రైలు ప్రయాణంలో టికెట్ తనిఖీలు చేసే సమయంలో ప్రయాణికులతో సిబ్బందికి తరచూ వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో టికెట్ కలెక్టర్లపై ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. వెయిటింగ్ టికెట్ తనిఖీ చేసే సమయం, ఆర్ఏసీ ఉన్న ప్రయాణికులకు బెర్త్‌లు కేటాయించే విషయంలోనూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. వీటికి పూర్తిస్థాయిలో చెక్ చెప్పాలని రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ తనిఖీ అధికారులకు బాడీ కెమెరాలు అమర్చుతోంది. పైలట్ ప్రాజెక్టుగా మూడు నెలల కిందట సెంట్రల్ రైల్వే పరిధిలో 50 మంది టికెట్ కలెక్టర్లకు బాడీ కెమెరాలు అమర్చింది. అప్పటి నుంచి ఒక్క ఫిర్యాదు గానీ, ప్రయాణికుల వాగ్వాద సంఘటనలు గానీ నమోదు కాలేదు. దీంతో మిగిలిన జోన్లలోనూ అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఒక్కో కెమెరా రూ.9 వేలు.. రైల్వే నెట్వర్క్ పరిధిలోని అన్ని జోన్లకూ బాడీ కెమెరాలు అందించాలని రైల్వే మంత్రిత్వ శాఖ బోర్డుకు సూచించింది. ఈ నేపథ్యంలో ఈస్ట్‌కోస్ట్ జోన్ పరిధిలో బాడీ కెమెరాలు అందించనున్నారు. ఇందులో భాగంగా వాల్తేరు డివిజన్ పరిధిలో టీసీలకు వీటిని అమర్చనున్నారు. ఒక్కొక్కటి రూ.9,000 విలువైన ఈ బాడీ కెమెరాలు దాదాపు 20 గంటల ఫుటేజీని రికార్డు చేయగలవు. బాడీ కెమెరాలు టికెట్ తనిఖీ సమయంలో ఉద్యోగుల పారదర్శకతను కాపాడుకోవడంలో సహాయపడతాయి. దీంతో పాటు అక్రమ చర్యలను నిరోధించవచ్చు. ఫిర్యాదుల సందర్భంలో, టిక్కెట్ తనిఖీ సమయంలో ఏదైనా వ్యత్యాసాన్ని గుర్తించడంలో కీలక పాత్ర పోషించనున్నాయని వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు చెబుతున్నారు. వృత్తి నైపుణ్యం పెంచడంతో పాటు సిబ్బంది రక్షణకు దోహదపడతాయని అభిప్రాయపడుతున్నారు. -
టికెట్ అడిగేసరికి బిడ్డనే వదిలేశారు!
టెల్అవీవ్: బెల్జియం పాస్‌పోర్టులున్న ఆ దంపతులిద్దరూ ఏడాది వయస్సున్న బిడ్డను తీసుకుని ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మరికాసేపట్లో బయలుదేరే బ్రస్సెల్స్ విమానంలో వారు ఎక్కాల్సి ఉంది. ఆలస్యంగా వచ్చిన వారిని ఒకటో నంబర్ టెర్మినల్ వద్ద సిబ్బంది ఆపి టికెట్లడిగారు. రెండు టికెట్లే చూపారు. చిన్నారికి కూడా టికెట్ కావాలనే సరికి ఇదేమిటంటూ ప్రశ్నించారు. సిబ్బందితో వాదనకు దిగారు. మరో టికెట్ కొనడానికి నిరాకరించారు. పైపెచ్చు, ష్ట్రోలర్పైన చిన్నారిని అక్కడే సెక్యూరిటీ విభాగం వద్ద వదిలేసి హడావుడిగా విమానం వైపు వెళ్లిపోబోయారు. ఇది చూసి సిబ్బంది అప్రమత్తమయ్యారు. సిబ్బంది అలెర్ట్ చేయడంతో సెక్యూరిటీ అధికారులు వారిని అడ్డుకుని, పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన జనవరి 31వ తేదీన ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్లో ఉన్న బెన్ గురియన్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. టికెట్ అడిగారనే కారణంతో ఏకంగా బిడ్డనే వదిలేసిన తల్లిదండ్రులను ఇప్పుడే చూస్తున్నామని అక్కడి సిబ్బంది వ్యాఖ్యానించారు. ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటన తమకు షాక్ కలిగించిందని సిబ్బంది తెలిపారని రియాన్ఎయిర్ విమానయాన సంస్థ అధికారి ఒకరు అన్నారు. -
దారుణం: టిక్కెట్ కలెక్టర్ ప్రయాణికుడిని చితకబాది, బూట్లతో తన్నుతూ..
ప్రయాణికుడి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఇద్దరు టిక్కెట్ కలెక్టర్లను సస్పెండ్ చేశారు. ఈ ఘటన బిహార్‌లోని మజఫర్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ముంబై నుంచి ఢిల్లీలోని జైనగర్‌కి వెళ్తున్న ట్రైయిన్‌లోని ఒక ప్రయాణికుడికి, టిక్కెట్ కలెక్టర్‌కి మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో సదరు టిక్కెట్ కలెక్టర్ ఆ ప్రయాణికుడుని పైబెర్త్ నుంచి కిందకు లాగేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అతనికి తన సహ టిక్కెట్ కలెక్టర్ కూడా సహకరించడంతో.. సదరు ప్రయాణికుడి కిందకు లాగి పడేశారు. ఆ తర్వాత అతన్ని దారుణంగా కొట్టి, బూట్లతో తన్నుతూ.. అత్యంత దారుణంగా ప్రవర్తించారు. అందుకు సంబంధించిన వీడియోని ఒక ప్రయాణికుడు రికార్డు చేయడంతో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఐతే అదే సమయంలో మరో ప్రయాణికుడు ముందుకు వచ్చి అతన్ని కొట్టవద్దంటూ టిక్కెట్ కలెక్టర్‌ని వారించి, గొడవ సద్దుమణిగేలా చేశాడు. ఈ ఘటన జనవరి 2న ఢిల్లీలోని ధోలి రైల్వేస్టేషన్‌కి సమీపంలో చోటు చేసుకుంది. సదరు ప్రయాణికుడు టిక్కెట్ లేకుండా ప్రయాణించడంతోనే వారి మధ్య వాగ్వాదం తలెత్తినట్లు సమాచారం. దీంతో రైల్వే శాఖ సదరు టిక్కెట్ కలెక్టర్లను సస్పెండ్ చేసినట్లు రైల్వే ప్రతినిధి తెలిపారు. ఈ ఘటన విషయమై అధికారులు వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారని పేర్కొన్నారు. (చదవండి: ముంబైలో బాలీవుడ్ సెలబ్రెటీలతో యోగి భేటీ) -
రైల్వే టీటీఈలకు కొత్త మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: 137 ఏళ్లుగా రైల్లో తెల్ల డ్రెస్సుపై నల్ల కోటు ధరించి దగ్గరికొచ్చి టికెట్ చెక్ చేసే రైల్వే టికెట్ కలెక్టర్ రూపం కరోనా కారణంగా మారిపోనుంది. వీరికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను రైల్వే బోర్డు విడుదల చేసింది. ఇకపై వారు చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్కులు ధరించి దూరంగా నిలబడి భూతద్దం ద్వారా టికెట్లను పరిశీలించనున్నారు. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న 100 జంట రైళ్లలో వీరు ఈ విధంగా కనిపించే అవకాశం ఉంది. కరోనా ముప్పును తగ్గించేందుకు టై, కోటును ధరించకుండా విధులు నిర్వహించాలని రైల్వే బోర్డు స్పష్టం చేసింది. అయితే పేరు కలిగిన ప్లేట్ మాత్రం ధరిస్తారని చెప్పింది. విధుల్లోకి వెళ్లే ముందు వీరికి థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. ఒకవేళ ఉద్యోగులకు శ్వాసకోశ సంబంధమైన సమస్యలు ఉంటే ముందే చెప్పాల్సిందిగా కోరింది. వారికి తగిన మాస్కులు, ముఖానికి అడ్డు పెట్టుకునే కవచాలు, గ్లౌజులు, తలకు ధరించే కవర్లు, శానిటైజర్లు, సోపులు అందించనున్నట్లు చెప్పింది. టికెట్లను పరిశీలించేందుకు భూతద్దం ఇవ్వనున్నట్లు చెప్పింది. టికెట్లను తాకకుండా పరిశీలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. దీనికి సీనియర్ టికెట్ కలెక్టర్ ఇంచార్జ్ బాధ్యతలు తీసుకోనున్నారు. అవి రెగ్యులర్ రైళ్లు కాదు వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు చేరవేయడానికి ప్రవేశపెట్టిన శ్రామిక్ ప్రత్యేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు వెల్లువెత్తుతున్న విమర్శలపై రైల్వేశాఖ వివరణ ఇచ్చింది. అవి రెగ్యులర్ రైళ్లు కాదని, వలస కూలీల అవసరాన్ని బట్టి వాటి గమ్యస్థానాన్ని పొడిగించడం లేదా కుదించడం.. దారి మళ్లించడం వంటివి చేస్తున్నామని, అందువల్లే కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉందని పేర్కొంది. మే 1వ తేదీ నుంచి ఇప్పటిదాకా 3,840 ప్రత్యేక రైళ్లు నడిపామని, వీటిలో 52 లక్షల మంది ప్రయాణించారని రైల్వేబోర్డు చైర్మన్ వి.కె.యాదవ్ చెప్పారు. అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణులు, పదేళ్ల లోపు చిన్నారులు, వృద్ధులు శ్రామిక్ రైళ్లలో ప్రయాణించకపోవడమే మంచిదని సూచించింది. మే 27న ఈ రైళ్లలో మరణించిన తొమ్మిది మందికి అంతకు ముందే ఆరోగ్య సమస్యలున్నట్టు తేలిందని వెల్లడించింది. ఏదైనా సమస్య తలెత్తితే హెల్ప్‌లైన్ నంబర్లు 139, 138కు ఫోన్ చేయాలని కోరింది. -
ఆదాయం పెరిగితేనే అదనపు రైళ్లు
సీనియర్ కమర్షియల్ మేనేజర్ శ్రీరాములు గిద్దలూరు : రైల్వేస్టేషన్ రోజు వారీ ఆదాయం పెరిగితేనే గిద్దలూరు మీదుగా అదనపు రైళ్లను నడపగలమని సీనియర్ కమర్షియల్ మేనేజర్ శ్రీరాములు చెప్పారు. స్థానిక రైల్వేస్టేషన్‌ను ఆయన ఆదివారం తనిఖీ చేశారు. పరిసరాలను పరిశీలించిన ఆయన.. స్టేషన్‌లోని అన్ని ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. రికార్డులను తనిఖీ చేసి టికెట్ల ద్వారా ఎంత ఆదాయం వస్తోందని ఆరా తీశారు. అక్టోబర్ నెలలో తక్కువ ఆదాయం రావడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత నెలలో రూ.17.60 లక్షల ఆదాయంరాగా, ఈ నెలలో ప్రస్తుతానికి రూ.13.87 లక్షలు వచ్చినట్లు శ్రీరాములు గుర్తించారు. ఇలా ప్రతి నెలా ఆదాయం తగ్గుతుంటే అదనపు బోగీలు, రైళ్లు నడపడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిం చారు. గిద్దలూరు ప్రాంతంలో ఎక్కువ మంది ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారని, గరీభ్థ్ ్రరైలును ఇక్కడ ఆగేలా చర్యలు తీసుకోవాలని విలేకరులు కోరగా కనీసం వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించేందుకు టికెట్లు అమ్ముడుపోతేనే ఆ రైలును ఇక్కడ ఆపుతామని చెప్పారు. ఎక్కువ మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించేలా చర్యలు తీసుకుంటే అదనపు సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందన్నారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లే వారు గిద్దలూరులోనే పూర్తిస్థాయి టిక్కెట్ తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే నడుస్తున్న రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, బోగీలు సిద్ధం కావాల్సి ఉందని, త్వరలోనే ఆ ప్రక్రియ పూర్తవుతుందని తెలి పారు. యడవల్లి రైల్వేస్టేషన్లో టిక్కెట్లు ఇచ్చేందుకు చొరవ చూపాలని కోరగా అక్కడ ఎంతమేర ఆదాయం వస్తుందో పరిశీలించి నివేదిక ప్రకారం టిక్కెట్లు ఇచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. స్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ ఎక్కువ సమయం పనిచేసేలా చూడాలని, చాలా మంది నంద్యాల వెళ్లి రిజర్వేషన్ చేయించుకుంటున్నారని, రైల్వే విచారణ కోసం ఫోన్ చేస్తే సిబ్బంది ఫోన్ తీసి సమాధానం చెప్పడం లేదని విలేకర్లు ఆయన దృష్టికి తీసుకెళ్లగా సిబ్బందితో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. స్టేషన్లో గంటకొట్టే వద్ద ఉన్న బూజు, దుమ్మును గమనించిన శ్రీరాములు.. స్టేషన్ మాస్టర్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్‌ను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియదా అని ప్రశ్నించారు. ఆయనతో పాటు పలువురు టిక్కెట్ కలెక్టర్లు, స్క్వాడ్ అధికారులు ఉన్నారు.