సాక్షి, అనకాపల్లి: మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వంపై టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు గెడ్డం ఉమ మండిపడ్డారు. బండారు సోషల్ మీడియాలో చేసిన తప్పుడు పోస్టులపై సోమవారం ఆమె ఘాటుగా స్పందించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. పరవాడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 13వ తేదీన తన సోదరిపై సంతోష్‌కుమార్ అనే ఈవ్ టీజింగ్‌కి పాల్పడ్డాడు.
ఆమె ధైర్యంగా స్థానిక పోలీస్‌స్టేషన్‌ల్లో ఫిర్యాదు చేసింది. ఆ మరుక్షణమే పోలీసులు నిందితుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన గుంటూరుకు చెందిన సంతోష్‌కుమార్ పరవాడ ఫైలాన్ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. మహిళ గౌరవ భంగానికి చెందిన అంశాన్ని బండారు సత్యనారాయణమూర్తి లాంటి వ్యక్తులు రాజకీయం చేయడం సరికాదని ఆమె హితవుపలికారు.
కుమార్తె సమానురాలైన ఆడపిల్లపై ఈవ్‌టీజింగ్‌కి పాల్పడితే.. దాన్ని అత్యాచారయత్నమని.. ఆ కుటుంబ గౌరవాన్ని బయటకు తీసేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం సంస్కారమా..? బండారు అని ప్రశ్నించారు. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవం అని మండిపడ్డారు. మహిళా భద్రత కోసం దిశ పోలీస్‌స్టేషన్‌లు, దిశ యాప్‌లను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.
తప్పుడు పోస్టులపై ఎస్పీకి ఫిర్యాదు
సోషల్ మీడియాలో తనపై తప్పుడు పోస్టులు పెడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు గెడ్డం ఉమ కోరారు. సోమవారం ఈమేరకు ఆమె అనకాపల్లి ఎస్పీ మురళీకృష్ణకు ఫిర్యాదు చేశారు. కొన్ని రోజులుగా తనపై వివిధ మాధ్యమాలలో అసత్య పోస్టులు పెడుతూ తీవ్ర ఆరోపణలు చేస్తున్న వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ఎస్పీకి ఆమె విజ్ఞప్తి చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా మహిళలపై తప్పుడు పోస్టులు పెట్టే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment