విశాఖ కేంద్రకారాగారం
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారంలో వసూళ్ల రాజాలు చెలరేగుతున్నారు. జైళ్లలో నూతన సంస్కరణలు తీసుకొచ్చి శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో మార్పు తీసుకురావడానికి ఓ పక్క కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. వాటిని అమలు చేయాల్సిన జైల్ అధికారుల్లో కొందరు ఆ విధానాలను విస్మరిస్తున్నారు. విశాఖ కేంద్ర కారాగారంలో ఖైదీల నుంచి ఓ అధికారి డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. జైల్ లోపల ఖైదీల లీడర్లతో డబ్బులను వసూలు చేయించి జేబులు నింపుకొంటున్నారు. ఇక్కడ జైల్‌లో నర్మదా, తపతి, గోదావరి, పెన్నా, కావేరి, గోస్తని, గంగా, తదితర నదుల పేర్లతో బేరక్‌లున్నాయి. సాధారణ ఖైదీలు, రిమాండ్ ఖైదీలు, తీవ్ర నేరాలకు పాల్పడి శిక్ష పడిన ఖైదీలు, మావోయిస్టులు తదితర ఖైదీలను వేర్వేరుగా ఆయా బేరక్‌లలో పెడతారు.ప్రతి బేరక్‌లకు సీనియర్ ఖైదీలు మేసీ్త్రలు (లీడర్లు)గా ఉంటారు. వారు మిగిలిన ఖైదీలను నియంత్రిస్తూ జైల్ సిబ్బందికి సహాయకులుగా ఉంటారు.
జైల్‌కు వెళ్లే రిమాండ్ ఖైదీలను తక్కువ రద్దీ గల బేరక్‌లలో పెట్టాల్సి ఉంది. అలాంటి బేరక్‌లలో పెట్టడానికి రిమాండ్ ఖైదీల నుంచి ఓ అధికారి మేసీ్త్రల సాయంతో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఖైదీల కుటుంబ సభ్యుల నుంచి మేసీ్త్రల కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు జమ చేసుకొని తర్వాత విత్‌డ్రాలు చేస్తున్నట్లు తెలిసింది. అలా డబ్బులు ఇవ్వని ఖైదీలను కరుడు కట్టిన నేరాలు చేసి శిక్ష అనుభవిస్తున్న బేరక్‌లు, రద్దీగా ఉండే బేరక్‌లలో వేస్తామని, అక్కడ ఆ ఖైదీల మధ్య తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరిస్తున్నారని, శిక్ష పూర్తిచేసుకొని బయటకు వచ్చిన వారు, బెయిల్‌పై బయటకు వచ్చిన వారు ఆవేదన చెందుతున్నారు.
జైల్‌లో ఉన్నప్పుడు దీనిపై వారిని నిలదీస్తే ఎలాంటి సమస్య ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఫిర్యాదు చేయలేకపోయామని అంటున్నారు. ఖైదీల కుటుంబ ఆర్థిక పరిస్థితిని బట్టి ఒక్కొక్కరి నుంచి రూ 5,000 నుంచి ఆపైన వసూలు చేస్తున్నారని అంటున్నారు. ఆ అధికారి గతంలో పనిచేసిన జైల్‌లో కూడా ఇదే తీరు కనబరిచాడని, ఉన్నతాధికారులు పలుసార్లు మందలించినా ఆయన తీరు మారలేదని ఇక్కడ సిబ్బందిలో కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. జైల్ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి ఇలాంటి పరిణామాలు జరగకుండా అడ్డుకట్టవేయాలని ఖైదీల కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
ఎలాంటి ఫిర్యాదులు రాలేదు
జైల్‌లో ఖైదీల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు మాకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ఖైదీలను ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే మా దృష్టికి తీసుకురావాలి. మేం ప్రతిరోజు జైల్‌లో రౌండ్స్‌కు వెళుతుంటాం. ఆ రౌండ్స్‌లో ఖైదీల సమస్యలు కూడా అడుగుతుంటాం. అలాంటిప్పుడు ఖైదీలు నిర్భయంగా ఏ సమ స్య గురించైనా చెప్పవచ్చు. కానీ ఇంతవరకు ఎవరూ డబ్బులు అడుగుతున్నట్లు మాకు చెప్పలేదు. అధికారులు, సిబ్బందిని పిలిపించి దీని పై సీరియస్‌గా హెచ్చరిస్తాం. ఒకవేళ డబ్బులు తీసుకున్నట్టు వెల్లడైతే చర్యలు తీసుకొంటాం.
–కిశోర్‌కుమార్, కేంద్ర కారాగారం సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment