Tirumala Express: తిరుమల దూరాభారం | - | Sakshi
Sakshi News home page

Tirumala Express: తిరుమల దూరాభారం

Published Fri, Oct 25 2024 1:32 AM | Last Updated on Fri, Oct 25 2024 9:40 AM

-

 రైల్వే బోర్డుకి ప్రతిపాదనలుపంపిన అధికారులు 

ఒంగోలు రూట్‌లో కాకుండా గుంటూరు, నంద్యాల మీదుగా వెళ్లేలా మార్పులు 

ఇదే జరిగితే 5 గంటలు ఆలస్యంగా తిరుపతి చేరుకోనున్న స్థానిక భక్తులు 

 వాల్తేరు డివిజన్‌ అభిప్రాయం తీసుకోకుండానే కుట్రకు తెర! 

తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలంటే కోస్తాంధ్ర జిల్లాల భక్తులందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క రైలు తిరుమల ఎక్స్‌ప్రెస్‌. ఈ రైలు ఎక్కితే.. స్వామి దర్శనానికి సరైన సమయంలో చేరుకోవచ్చు. అందుకే ఈ రైలుకు అంత డిమాండ్‌. కానీ.. ఇప్పుడా పరిస్థితులు కనిపించవేమో.? ఎందుకంటే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రూట్‌ మార్చేందుకు దక్షిణ మధ్య రైల్వే యత్నిస్తోంది. కొత్త రూట్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేసి రైల్వే బోర్డుకు పంపింది. వాల్తేరు డివిజన్‌ అభిప్రాయం తీసుకోకుండానే కుట్రకు తెర తీసినట్లు తెలుస్తోంది. 

సాక్షి, విశాఖపట్నం: తిరుమల ఎక్స్‌ప్రెస్‌ ఒక రైలు కాదు.. ఆధ్యాత్మిక కేంద్రం. శ్రీకాకుళం నుంచి ఒంగోలు వరకు తిరుపతి వెళ్లే ప్రయాణికులు కచ్చితంగా ఎంపిక చేసుకునే మొదటి ఆప్షన్‌ ఈ రైలే. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే వేళలకు అనువుగా తిరుపతి చేర్చే రైలు దాదాపు ఇదే ఉంది. అందుకే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ భక్తులకు సెంటిమెంట్‌గా మారిపోయింది. ఈ ఎక్స్‌ప్రెస్‌కి వెళ్తేనే తిరుపతి వెళ్లి.. ఏడుకొండల వాడి దర్శనం సజావుగా సాగుతుందనే నమ్మకం చాలా మందిలో ఉంది. అందుకే ఈ రైలు ప్రతి రోజూ 100 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో పరుగులు పెడుతుంటుంది. వెయిటింగ్‌ లిస్ట్‌ చాంతాడంత పెరిగిపోయినా.. రిజర్వేషన్‌ కన్‌ఫర్మ్‌ అవుతుందనే ఏదో ఒక నమ్మకంతో ఈ రైలుకే రిజర్వేషన్‌ చేస్తుంటారు. ఒక వేళ సీటు దొరక్కపోయినా నిలబడైనా వెళ్లేందుకు సిద్ధమైపోతుంటారు.

దర్శన వేళలకు అనువైన రైలు
తిరుమల దర్శనానికి అన్ని ప్రాంతాల వారికీ అనువైన రైలు ఇదే. 17488 నంబర్‌తో నడిచే ఈ సర్వీస్‌ విశాఖలో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరుతుంది. తిరుపతి రైల్వేస్టేషన్‌కు తర్వాత రోజు వేకువజామున 4.30కి చేరుకుంటుంది. అక్కడ దిగే భక్తులు అలిపిరి మార్గంలోనైనా, శ్రీవారి మెట్ల మార్గంలోనైనా వెళ్లేందుకు సరైన సమయం ఇది. అంటే తిరుపతిలో దిగి స్నానమాచరించి శ్రీవారి మెట్ల మార్గానికి ఉదయం 6 గంటలకు చేరుకుంటే ఉదయం 10 లేదా 11 గంటల దర్శనానికి టోకెన్‌ లభిస్తుంది. ఆ టోకెన్‌తో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణం కూడా సులువవుతుంది. అందుకే తిరుమల ఎక్స్‌ప్రెస్‌నే అందరూ నమ్ముకుంటారు.

అదనంగా నాలుగైదు గంటలు వృథా
వాస్తవానికి ఈ రైలు ఈస్ట్‌కోస్ట్‌ జోన్‌ పరిధిలో ఉన్నప్పటికీ.. నడిచే రూట్‌ మొత్తం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే ఉంది. విశాఖలో బయలుదేరి దువ్వాడ వరకు మాత్రమే ఈస్ట్‌కోస్ట్‌ పరిధిలోకి వస్తుంది. మిగిలినదంతా దక్షిణ మధ్య రైల్వే జోన్‌ పరిధిలో ఉంది. అంతే కాకుండా ట్రైన్‌ టెర్మినేటింగ్‌ కూడా ఆ జోనే చూస్తోంది. అందుకే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ రూట్‌ మార్చే ప్రతిపాదనలు చేసేందుకు ఆ జోన్‌కు అన్ని అర్హతలున్నాయి. 

దీన్ని ఆసరాగా తీసుకుని కొన్ని రూట్లకు రైలు అవసరమని.. అందుకే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను ఆ వైపుగా దారి మళ్లించేందుకు అంగీకరించాలంటూ రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపించింది. విజయవాడ నుంచి ఒంగోలు మీదుగా కాకుండా.. విజయవాడ నుంచి గుంటూరు, నంద్యాల, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట మీదుగా తిరుపతి వెళ్లేలా రూట్‌ మార్పులకు అనుమతి కోరింది. దీనికి బోర్డు ఓకే చెబితే.. మన ప్రయాణం మరింత భారంగా మారుతుంది. ప్రస్తుతం విశాఖపట్నంలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ రైలు ఎక్కితే 14.30 గంటల పాటు తిరుపతికి ప్రయాణం సాగుతుంది. 

కొత్త రూట్‌ అయితే మరో 5 గంటలు అదనపు సమయం పడుతుంది. అంటే విశాఖపట్నంలో మధ్యాహ్నం రెండు గంటలకు రైలు ఎక్కితే.. తర్వాత రోజు ఉదయం 9 లేదా 10 గంటలకు తిరుపతి చేరుకుంటారు. దీని వల్ల దర్శన వేళలకు అందే అవకాశం ఉండదు. ఈ రూట్‌ మార్చితే ఉత్తరాంధ్రతో పాటు విజయవాడ వరకూ ఉన్న భక్తులు తిరుమల వెళ్లేందుకు అవస్థలు తప్పవు. దక్షిణ మధ్య రైల్వే దుర్బుద్ధిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రూటు మారితే చేటే.!
1970లో ప్రారంభమైన తిరుమల ఎక్స్‌ప్రెస్‌ సర్వీస్‌ కొన్నేళ్ల కిందట కడప వరకూ పొడిగించారు. అయినప్పటికీ కోస్తాంధ్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. కారణం తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత కడప వెళ్లేది. ఇప్పుడు మరోసారి రూట్‌ మార్చేందుకు దక్షిణ మధ్య రైల్వే కుయుక్తులు పన్నుతోంది. ప్రస్తుతం ఈ రైలు విజయవాడ నుంచి ఒంగోలు, నెల్లూరు, గూడూరు జంక్షన్‌, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట జంక్షన్‌ మీదుగా తిరుపతి చేరుకుని అక్కడి నుంచి కోడూరు, రాజంపేట మీదుగా కడప వెళ్తుంది. 

అయితే ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే పరిధిలోని తిరుమల ఎక్స్‌ప్రెస్‌ సర్వీసు రూటు మార్చాలని దక్షిణ మధ్య రైల్వే జోన్‌ అధికారులు భావిస్తున్నారు. కారణాలు ఏమీ చెప్పకుండానే రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలు ఒప్పుకుంటే ఇకపై విజయవాడ నుంచి ఒంగోలు వైపుగా వెళ్లకుండా.. గుంటూరు మీదుగా నడుస్తుంది. ఇదే జరిగితే భక్తులు తిరుపతి వెళ్లే సమయం పూర్తిగా మారిపోతుంది. వేళకు స్వామి దర్శనానికి అందే పరిస్థితి ఉండదు.

ఇదేం రూట్‌ మార్పు?
తిరుమల ఎక్స్‌ప్రెస్‌ అంటే మాకో నమ్మకం. ఎప్పుడు తిరుపతి వెళ్లాలన్నా.. ఈ రైలునే ఎంచుకుంటాం. ఎందుకంటే వేకువ జామునే తిరుపతి చేరుకుంటుంది. అక్కడ నుంచి ఎండ పెరిగే లోపు మెట్లమార్గంలోనైనా.. కాలినడకనైనా.. ఏ దర్శనానికై నా నిర్ణీత సమయానికి తిరుమలకు చేరుకుంటాం. దర్శనానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ప్రయాణం సాగిపోతుంది. అలాంటి రైలు రూట్‌ను మార్చడం సరికాదు. రైల్వే అధికారులు దీనిపై పునరాలోచించాలి.
– ఎం.ఉషారాణి, సీతమ్మధార

ప్రజాప్రతినిధులు ఒత్తిడి తేవాలి
తిరుపతి వెళ్లే ప్రతి భక్తుడూ దశాబ్దాలుగా తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను నమ్ముకుంటున్నారు. అలాంటి ఈ రైలును వేరే మార్గంలో తిప్పాలని ఎలా ప్రతిపాదిస్తారు? జోన్‌ అధికారులకు భక్తుల మనోభావాలతో సంబంధం లేదా? కొత్త రూట్‌లో తిప్పితే కోస్తాంధ్ర జిల్లాల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు రైల్వే బోర్డుపై ఒత్తిడి తేవాలి. సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ పంపిన ప్రతిపాదనలు తిప్పికొట్టేలా పోరాడాలి.
– కె.రామసుధ, ప్రయాణికురాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement