Tirumala Express
-
Tirumala Express: తిరుమల దూరాభారం
తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలంటే కోస్తాంధ్ర జిల్లాల భక్తులందరికీ గుర్తొచ్చే ఒకే ఒక్క రైలు తిరుమల ఎక్స్‌ప్రెస్. ఈ రైలు ఎక్కితే.. స్వామి దర్శనానికి సరైన సమయంలో చేరుకోవచ్చు. అందుకే ఈ రైలుకు అంత డిమాండ్. కానీ.. ఇప్పుడా పరిస్థితులు కనిపించవేమో.? ఎందుకంటే తిరుమల ఎక్స్‌ప్రెస్ రూట్ మార్చేందుకు దక్షిణ మధ్య రైల్వే యత్నిస్తోంది. కొత్త రూట్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేసి రైల్వే బోర్డుకు పంపింది. వాల్తేరు డివిజన్ అభిప్రాయం తీసుకోకుండానే కుట్రకు తెర తీసినట్లు తెలుస్తోంది. సాక్షి, విశాఖపట్నం: తిరుమల ఎక్స్‌ప్రెస్ ఒక రైలు కాదు.. ఆధ్యాత్మిక కేంద్రం. శ్రీకాకుళం నుంచి ఒంగోలు వరకు తిరుపతి వెళ్లే ప్రయాణికులు కచ్చితంగా ఎంపిక చేసుకునే మొదటి ఆప్షన్ ఈ రైలే. వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే వేళలకు అనువుగా తిరుపతి చేర్చే రైలు దాదాపు ఇదే ఉంది. అందుకే తిరుమల ఎక్స్‌ప్రెస్ భక్తులకు సెంటిమెంట్‌గా మారిపోయింది. ఈ ఎక్స్‌ప్రెస్‌కి వెళ్తేనే తిరుపతి వెళ్లి.. ఏడుకొండల వాడి దర్శనం సజావుగా సాగుతుందనే నమ్మకం చాలా మందిలో ఉంది. అందుకే ఈ రైలు ప్రతి రోజూ 100 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో పరుగులు పెడుతుంటుంది. వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత పెరిగిపోయినా.. రిజర్వేషన్ కన్ఫర్మ్ అవుతుందనే ఏదో ఒక నమ్మకంతో ఈ రైలుకే రిజర్వేషన్ చేస్తుంటారు. ఒక వేళ సీటు దొరక్కపోయినా నిలబడైనా వెళ్లేందుకు సిద్ధమైపోతుంటారు.దర్శన వేళలకు అనువైన రైలుతిరుమల దర్శనానికి అన్ని ప్రాంతాల వారికీ అనువైన రైలు ఇదే. 17488 నంబర్‌తో నడిచే ఈ సర్వీస్ విశాఖలో మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరుతుంది. తిరుపతి రైల్వేస్టేషన్‌కు తర్వాత రోజు వేకువజామున 4.30కి చేరుకుంటుంది. అక్కడ దిగే భక్తులు అలిపిరి మార్గంలోనైనా, శ్రీవారి మెట్ల మార్గంలోనైనా వెళ్లేందుకు సరైన సమయం ఇది. అంటే తిరుపతిలో దిగి స్నానమాచరించి శ్రీవారి మెట్ల మార్గానికి ఉదయం 6 గంటలకు చేరుకుంటే ఉదయం 10 లేదా 11 గంటల దర్శనానికి టోకెన్ లభిస్తుంది. ఆ టోకెన్‌తో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత తిరుగు ప్రయాణం కూడా సులువవుతుంది. అందుకే తిరుమల ఎక్స్‌ప్రెస్‌నే అందరూ నమ్ముకుంటారు.అదనంగా నాలుగైదు గంటలు వృథావాస్తవానికి ఈ రైలు ఈస్ట్‌కోస్ట్ జోన్ పరిధిలో ఉన్నప్పటికీ.. నడిచే రూట్ మొత్తం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే ఉంది. విశాఖలో బయలుదేరి దువ్వాడ వరకు మాత్రమే ఈస్ట్‌కోస్ట్ పరిధిలోకి వస్తుంది. మిగిలినదంతా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఉంది. అంతే కాకుండా ట్రైన్ టెర్మినేటింగ్ కూడా ఆ జోనే చూస్తోంది. అందుకే తిరుమల ఎక్స్‌ప్రెస్ రూట్ మార్చే ప్రతిపాదనలు చేసేందుకు ఆ జోన్‌కు అన్ని అర్హతలున్నాయి. దీన్ని ఆసరాగా తీసుకుని కొన్ని రూట్లకు రైలు అవసరమని.. అందుకే తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను ఆ వైపుగా దారి మళ్లించేందుకు అంగీకరించాలంటూ రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపించింది. విజయవాడ నుంచి ఒంగోలు మీదుగా కాకుండా.. విజయవాడ నుంచి గుంటూరు, నంద్యాల, ఎర్రగుంట్ల, కడప, రేణిగుంట మీదుగా తిరుపతి వెళ్లేలా రూట్ మార్పులకు అనుమతి కోరింది. దీనికి బోర్డు ఓకే చెబితే.. మన ప్రయాణం మరింత భారంగా మారుతుంది. ప్రస్తుతం విశాఖపట్నంలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ రైలు ఎక్కితే 14.30 గంటల పాటు తిరుపతికి ప్రయాణం సాగుతుంది. కొత్త రూట్ అయితే మరో 5 గంటలు అదనపు సమయం పడుతుంది. అంటే విశాఖపట్నంలో మధ్యాహ్నం రెండు గంటలకు రైలు ఎక్కితే.. తర్వాత రోజు ఉదయం 9 లేదా 10 గంటలకు తిరుపతి చేరుకుంటారు. దీని వల్ల దర్శన వేళలకు అందే అవకాశం ఉండదు. ఈ రూట్ మార్చితే ఉత్తరాంధ్రతో పాటు విజయవాడ వరకూ ఉన్న భక్తులు తిరుమల వెళ్లేందుకు అవస్థలు తప్పవు. దక్షిణ మధ్య రైల్వే దుర్బుద్ధిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రూటు మారితే చేటే.!1970లో ప్రారంభమైన తిరుమల ఎక్స్‌ప్రెస్ సర్వీస్ కొన్నేళ్ల కిందట కడప వరకూ పొడిగించారు. అయినప్పటికీ కోస్తాంధ్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. కారణం తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న తర్వాత కడప వెళ్లేది. ఇప్పుడు మరోసారి రూట్ మార్చేందుకు దక్షిణ మధ్య రైల్వే కుయుక్తులు పన్నుతోంది. ప్రస్తుతం ఈ రైలు విజయవాడ నుంచి ఒంగోలు, నెల్లూరు, గూడూరు జంక్షన్, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట జంక్షన్ మీదుగా తిరుపతి చేరుకుని అక్కడి నుంచి కోడూరు, రాజంపేట మీదుగా కడప వెళ్తుంది. అయితే ఈస్ట్‌కోస్ట్ రైల్వే పరిధిలోని తిరుమల ఎక్స్‌ప్రెస్ సర్వీసు రూటు మార్చాలని దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు భావిస్తున్నారు. కారణాలు ఏమీ చెప్పకుండానే రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలు ఒప్పుకుంటే ఇకపై విజయవాడ నుంచి ఒంగోలు వైపుగా వెళ్లకుండా.. గుంటూరు మీదుగా నడుస్తుంది. ఇదే జరిగితే భక్తులు తిరుపతి వెళ్లే సమయం పూర్తిగా మారిపోతుంది. వేళకు స్వామి దర్శనానికి అందే పరిస్థితి ఉండదు.ఇదేం రూట్ మార్పు?తిరుమల ఎక్స్‌ప్రెస్ అంటే మాకో నమ్మకం. ఎప్పుడు తిరుపతి వెళ్లాలన్నా.. ఈ రైలునే ఎంచుకుంటాం. ఎందుకంటే వేకువ జామునే తిరుపతి చేరుకుంటుంది. అక్కడ నుంచి ఎండ పెరిగే లోపు మెట్లమార్గంలోనైనా.. కాలినడకనైనా.. ఏ దర్శనానికై నా నిర్ణీత సమయానికి తిరుమలకు చేరుకుంటాం. దర్శనానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ప్రయాణం సాగిపోతుంది. అలాంటి రైలు రూట్‌ను మార్చడం సరికాదు. రైల్వే అధికారులు దీనిపై పునరాలోచించాలి.– ఎం.ఉషారాణి, సీతమ్మధారప్రజాప్రతినిధులు ఒత్తిడి తేవాలితిరుపతి వెళ్లే ప్రతి భక్తుడూ దశాబ్దాలుగా తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను నమ్ముకుంటున్నారు. అలాంటి ఈ రైలును వేరే మార్గంలో తిప్పాలని ఎలా ప్రతిపాదిస్తారు? జోన్ అధికారులకు భక్తుల మనోభావాలతో సంబంధం లేదా? కొత్త రూట్లో తిప్పితే కోస్తాంధ్ర జిల్లాల ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు. ఉత్తరాంధ్ర ప్రజా ప్రతినిధులు రైల్వే బోర్డుపై ఒత్తిడి తేవాలి. సౌత్ సెంట్రల్ జోన్ పంపిన ప్రతిపాదనలు తిప్పికొట్టేలా పోరాడాలి.– కె.రామసుధ, ప్రయాణికురాలు -
నాంథేడ్–తిరుపతి మధ్య ప్రత్యేక రైలు
కడప కోటిరెడ్డిసర్కిల్: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా నాంథేడ్ – తిరుపతి– నాంథేడ్ల మధ్య (07633/07634) ఈనెలలో నాలుగు ట్రిప్పులను నడపనున్నట్లు కడప రైల్వే చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ ఉమర్ బాషా తెలిపారు. నాంథేడ్ నుంచి తిరుపతికి వచ్చే రైలు ఈనెల 16, 23 తేదీల్లో బయలుదేరుతుందన్నారు. నాంథేడ్లో ఆయా తేదీల్లో మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 5.45 గంటలకు కడపకు, 8.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుందన్నారు. తిరుపతి నుంచి నాంథేడ్‌కు వెళ్లే రైలు ఈనెల 17,24 తేదీల్లో బయలుదేరుతుందన్నారు. పలు రైళ్లకు స్టాపింగ్‌లు జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లకు ఆయా స్టేషన్లలో నిలిపేందుకు రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని రైల్వే అధికారులు తెలిపారు. తిరుమల, హరిప్రియ, రాయలసీమ రైళ్లను ఆపనున్నారు. ఈనెల 14 నుంచి తిరుమల ఎక్స్‌ప్రెస్‌ను రాజంపేట, నందలూరులో ఆపనున్నారు. ఈనెల 15 నుంచి హరిప్రియ ఎక్స్‌ప్రెస్‌ను ఓబులవారిపల్లి, నందలూరులో, రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ను ఈనెల 15నుంచి రైల్వేకోడూరు,ఓబులవారిపల్లి, రాజంపేట స్టేషన్లలో ఆపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఆరు నెలలు మాత్రమే ఈ అవకాశాన్ని రైల్వే అధికారులు కల్పించారని తెలిపారు. -
నెరవేరిన కడపవాసుల కల
సాక్షి, కడప : కడప ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. కడప నుండి శుక్రవారం సాయంత్రం 5గంటలకు విశాఖపట్నంకి తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు బయలుదేరింది. దీంతో కడప నుండి నేరుగా విజయవాడ, విశాఖపట్నంకు రైలు సౌకర్యం కల్పించినట్టయింది. ప్రయాణికుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు మార్గాన్ని పొడిగించాలని కడప, రాజంపేట మాజీ పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పలుసార్లు పార్లమెంటులో చర్చించారు. కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను వీరు స్వయంగా కలిసి వినతి పత్రాలు సమర్పించారు. దక్షిణ మధ్య రైల్యే బోర్డు మీటింగ్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం రైలును పొడిగించాలని పట్టుపట్టారు. అందుకు స్పందించిన కేంద్ర మంత్రి, దక్షిణ మధ్య రైల్వేబోర్డు అధికారులు తిరుపతి వరకు కొనసాగుతున్న తిరుమల ఎక్స్ ప్రెస్‌ను కడప వరకు పొడగించాలని నిర్ణయించారు. శుక్రవారం సాయంత్రం కడప నుంచి రైలు తిరుపతికి బయలుదేరింది. అటునుంచి విశాఖకు బయలుదేరుతుంది. నిన్నటి వరకు ప్రయాణికులు విజయవాడకువెళ్లాలంటే ధర్మవరం–విజయవాడ రైలును ఆశ్రయించాల్సి వచ్చేది. ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు,నంద్యాల మీదుగా వెళ్లాల్సి వచ్చేది. వారానికి 3రోజులు మాత్రమే ఈ రైలు నడుస్తోంది దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు విశాఖ–తిరుమలఎక్స్‌ప్రెస్ రైలు ప్రతి రోజు నడుస్తుంది కాబట్టి రాజధానికి వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. సమయం ఇలా.. విశాఖ–కడప ఎక్స్‌ప్రెస్ రైలు విశాఖపట్నంలో ప్రతిరోజు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి విజయవాడ మీదుగా తిరుపతికి మరుసటి రోజు ఉదయం 4.50 గంటలకు చేరుకుంటుంది. తిరుపతి నుంచి 5.20 గంటలకు బయలుదేరి రైల్వేకోడూరు, రాజంపేట, నందలూరు మీదుగా 8.25 గంటలకు కడప రైల్వేస్టేషన్‌కు వస్తుంది. ప్రతి రోజు సాయంత్రం 5.05 గంటలకు కడప స్టేషన్లో బయలుదేరి తిరుపతికి రాత్రి 8.00 గంటలకు చేరుకుంటుంది. అక్కడినుంచి రేణిగుంట, గూడూరు, నెల్లూరు, కావలి, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి మీదుగా విజయవాడ, నూజివీడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, ద్వారాపూడి, సామర్లకోట, అన్నవరం, యలమంచిలి, దువ్వాడ, విశాఖపట్నంకు ఉదయం 11.30 గంటలకు చేరుకుంటుంది. మాజీ ఎంపీలకు, దక్షిణ మధ్య రైల్యే అధికారులకు జిల్లాలోని ప్రయాణికులు కృతజ్ఞతలు చెబుతున్నారు.