స్వచ్ఛతలో విశాఖను అగ్రభాగాన నిలపాలి
● మేయర్ గొలగాని హరివెంకట కుమారి ● ఘనంగా స్వచ్ఛాంధ్ర– స్వచ్ఛదివస్ కార్యక్రమం
ఎంవీపీకాలనీ: స్వచ్ఛతలో విశాఖను అగ్రభాగాన నిలపాలని, ఈ క్రతువులో నగర ప్రజలంతా భాగస్వాములుగా నిలవాలని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర– స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ఆమె కలెక్టర్ హరేందిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ పి.సంపత్‌కుమార్, కార్పొరేటర్లు మువ్వల లక్ష్మి, గేదెల లావణ్యలతో కలిసి ప్రారంభించారు. శివాజీ పార్కులోని యోగ సాధన సెంటర్ వేదికగా శనివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర– స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. నగర కాలుష్యాన్ని తగ్గించే దిశగా జీవీఎంసీ మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని సూచించారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, మొక్కలు పెంపకం, కాలుష్య నియంత్రణ, వర్షపు నీరు నిల్వ చెయ్యడంపై నగర ప్రజలు దృష్టిసారించాలని కోరారు. కలెక్టర్ హరేందిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ సంపత్‌కుమార్ మాట్లాడుతూ ఇండోర్ నగరం మాదిరిగా పారిశుధ్యంలో విశాఖను నంబర్ వన్‌గా నిలపడంలో ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు. ప్రతి నెల 3వ శనివారం నగరంలోని అన్ని వార్డుల్లో స్వచ్ఛాంధ్ర– స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. శుభ్రతలో ప్రతి నెల నంబర్ 1గా నిలిచిన వార్డ్‌కు రూ.5 లక్షలు అభివృద్ధి నిధులు మంజూరు చేస్తామని, దీంతో పాటు ఆ వార్డ్‌లోని నలుగురు శానిటరీ కార్యదర్శులకు రూ.5 వేలు చొప్పున బహుమతి అందజేస్తామని చెప్పారు. అనంతరం శివాజీ పార్కులో మేయర్, కలెక్టర్, కమిషనర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, ఎస్‌ఎస్ వర్మ, ప్రధాన ఇంజినీర్ శివప్రసాద్ రాజు, డీడీహెచ్‌ఎం దామోదరరావు, యూసీడీ పీడీ సత్యవేణి, జోన్–3 కమిషనర్ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment