● వ్యాధిపై విస్తృత అవగాహన అవసరం ● సినీ నటి, లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గౌతమి ● నేడు బీచ్‌రోడ్డులో పింక్ సఖి శారీ వాక్
ఏయూక్యాంపస్ : క్యాన్సర్‌పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సినీ నటి, లైఫ్ ఎగైన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు గౌతమి తాడిమల్ల అన్నారు. బీచ్‌రోడ్డులోని ఓ హోటల్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆరోగ్యంగా జీవించడం అలవాటు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో విస్తృతంగా క్యాన్సర్ అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన వారికి చూసి స్ఫూర్తిని పొందాలని పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం బీచ్‌రోడ్డులో నిర్వహించే పింక్ సఖి శారీ వాక్‌లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ క్యాన్సర్ నివారణ, ప్రాథమిక దశలో గుర్తించడం, సరైన చికిత్స పొందడం, భయాన్ని విడిచిపెట్టడం ఎంతో అవసరమన్నారు. మంచి ఆరోగ్య అలవాట్లను కలిగి ఉండాలన్నారు. ప్రజల్లో క్యాన్సర్ పట్ల చైతన్యం పెంచాలన్నారు. తన కుటుంబంలో సైతం క్యాన్సర్ బారిన పడిన వారు ఉన్నారన్నారు. క్యాన్సర్ వ్యాధికి ఆన్సర్ (సమాధానం) ఉందన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లు, జనసమ్మర్థంగా ఉండే స్థలాల్లో క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. యాంకర్, సినీ నటి శిల్పా చక్రవర్తి మాట్లాడుతూ తన తల్లికి క్యాన్సర్ సోకిన సందర్భాన్ని వివరిస్తూ, విద్యావంతుల్లో సైతం వ్యాధి పట్ల అవగాహన తక్కువగా ఉంటోందన్నారు. ఇటువంటి సమాజ ఉపయుక్త కార్యక్రమంలో పాల్గొనడం సంతోషాన్నిస్తోందన్నారు. కాగా.. ఈ కార్యక్రమాన్ని రోహిత్ మెమోరియల్ ట్రస్ట్, రౌండ్ టేబుల్ లేడీస్ సర్కిల్ సంయుక్తంగా నిర్వహిస్తున్నా యి. ఉదయం 6 గంటలకు బీచ్‌రోడ్డు విశ్వప్రియ ఫంక్షన్ హాల్ నుంచి శారీ వాక్ ప్రారంభమవుతుంది.
కార్యక్రమంలో డీఎంహెచ్‌వో జగదీశ్వరరావు, రోహిత్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ జి.అనంత రామ్, ఉపాధ్యక్షురాలు డాక్టర్ మీనాక్షి అనంతరామ్, డైరెక్టర్ ప్రాజెక్ట్ (ఆర్‌ఎంటీ) గుర్మీత్ కోహ్లీ, శ్రావణ్ షిప్పింగ్ సర్వీసెస్ లిమిటెడ్ ఎండీ డాక్టర్ జి.సాంబశివ రావు, గురుద్వార సాథ్ సంగత్ అధ్యక్షుడు డాక్టర్ డీఎస్ ఆనంద్, ఏజ్ కేర్ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఎన్.ఎస్ రాజు, ఆళ్వార్‌దాస్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ ఎస్‌పీ రవీంద్ర, డాక్టర్ సీత కల్యాణి, డాక్టర్ ఎ.సుగంధి తదితరులు ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment