
ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సీఏల పాత్ర కీలకం
కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ప్రసన్నకుమార్
మద్దిలపాలెం: భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ పాత్ర కీలకమని చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కౌన్సిల్ ఉపాధ్యక్షుడు ప్రసన్నకుమార్ అన్నారు. మద్దిలపాలెంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా విశాఖపట్నం బ్రాంచ్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా 4.30 లక్షల మంది చార్టర్డ్ అకౌంటెంట్స్, 8 లక్షల మంది విద్యార్థులు ఉన్నట్లు వివరించారు. చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కార్యవర్గంలో 40 మంది ఎన్నికవ్వగా.. అందులో 8 మందిని కేంద్ర ప్రభుత్వం కౌన్సిల్ సభ్యులుగా నియమించిందని వెల్లడించారు. 2017లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీపై చాలా మందికి అపోహలు ఉండగా, వాటన్నింటినీ చార్టర్డ్ అకౌంటెంట్స్ నివృత్తి చేశారని గుర్తు చేశారు. తద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సీఏలు దోహదపడ్డారన్నారు. వికసిత్ భారత్ 2047 బృహత్తర కార్యక్రమానికి చార్టర్డ్ అకౌంటెంట్స్ కీలక భూమిక పోషిస్తున్నట్లు తెలిపారు. చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా 1949లో ఏర్పాటైందని, విశాఖపట్నంలో 1977లో బ్రాంచ్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ఆదాయపు పన్ను బిల్లుకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వడానికి చార్టర్డ్ అకౌంటెంట్స్ సిద్ధంగా ఉన్నట్లు వివరించారు. అనంతరం తెలుగు రాష్ట్రాల చార్టర్డ్ అకౌంటెంట్లు ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment