విద్యార్థులకు సీపీ బాగ్చి హెచ్చరిక
పీఎంపాలెం: ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఎంతో నష్టం కలిగించే మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. జీవీఎంసీ 6వ వార్డులోని బాబా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కళాశాలలో శనివారం జరిగిన ‘యాంటీ డ్రగ్ ఎడిక్షన్ అవేర్‌నెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంజినీరింగ్ విద్యార్థులు సివిల్ సర్వీసెస్‌ను టార్గెట్‌గా చేసుకుని పట్టుదలగా చదవాలని సూచించారు. దేశమంతటా డ్రగ్స్ మహమ్మారి వ్యాపించిందని, ఒకసారి డ్రగ్స్ తీసుకుంటే.. దానికి బానిసలయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందుకే అటువైపు కన్నెత్తి కూడా చూడరాదన్నారు. మత్తు పదార్థాలు తీసుకుంటే శ్వాస కోశ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందన్నారు.
సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణించడంతో పాటు నాడీ వ్యవస్థ దెబ్బతిని మానసిక వ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుందన్నారు. మత్తు పదార్థాలు అమ్మడం, కలిగి ఉండటం నేరమన్నారు. అటువంటి వారు పోలీసులకు పట్టుబడితే 10 నుంచి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ.లక్ష నుంచి 2 లక్షల జరిమానాను న్యాయస్థానం విధిస్తుందని హెచ్చరించారు. డ్రగ్స్‌కు సంబంధించి వివరాలు తెలిస్తే 79950 95799/1972 నంబర్లకు సమాచారం ఇవ్వాలని విద్యార్థులకు సూచించారు. కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment