
రుషికొండ బీచ్ ఉద్యోగులకు జీతాల్లేవ్..
● మూడు నెలలుగా అందని జీతాలు ● విధులు బహిష్కరించిన 38 మంది ఉద్యోగులు ● ఉద్యోగాలు తొలగిస్తామని అధికారుల హెచ్చరికలు
కొమ్మాది: బ్లూఫ్లాగ్ బీచ్‌గా అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన రుషికొండ బీచ్‌లో పనిచేస్తున్న చిరుద్యోగులు జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలలు గడుస్తున్నా వేతనాలు చెల్లించకపోవడంతో శనివారం నిరసన బాట పట్టారు. మూడున్నర నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నామని, జీతాల కోసం ఎదురుచూస్తూ విసిగిపోయామని వాపోతున్నారు. జీతాలు కోసం అధికారులను అడిగితే.. ‘జీతాల్లేవ్.. ఉప్పర మీటింగ్‌లు పెట్టి జీతాలు అడిగితే ఉద్యోగాల నుంచి తొలగించేస్తాం.’అంటూ తమపై చిందులు తొక్కుతున్నారని ఆరోపించారు.
రుషికొండ బీచ్‌లో 38 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 8 మంది టికెట్ కలెక్టర్లు, 9 మంది సెక్యూరిటీ గార్డులు, 13 మంది బీచ్ క్లీనర్లు, నలుగురు లైఫ్ గార్డ్స్, ఇద్దరు సూపర్‌వైజర్లు, ఎలక్ట్రీషియన్, ఫస్ట్ ఎయిడ్ ఉద్యోగి ఉన్నారు. వీరే లేకపోతే బీచ్ నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతుంది. పర్యాటకుల భద్రత ప్రమాదంలో పడుతుంది. తక్కువ జీతాలతో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తున్నప్పటికీ, నెలల తరబడి జీతాలు అందకపోవడంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను టూరిజం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో శనివారం విధులు బహిష్కరించి నిరసనకు దిగారు. విధులకు హాజరు కాకుండా ఆందోళన చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని సంబంధిత అధికారులు వారిని హెచ్చరించారు. అయినప్పటికీ ఉద్యోగులు వెనక్కి తగ్గకుండా నిరసన కొనసాగించారు. ‘మా జీతాలు చెల్లించి.. ఆ తర్వాత ఉద్యోగాలు తీసేయండి’అని ఉద్యోగులు స్పష్టం చేశారు. జీతాలు చెల్లించే వరకు విధులకు హాజరుకాబోమని తేల్చి చెప్పారు.
ఆర్డీ అత్యుత్సాహం
రుషికొండ బీచ్‌లో గతంలో ప్రవేశ టికెట్ కలెక్టర్లుగా 8 మంది విధుల్లో చేరారు. అయితే రీజినల్ డైరెక్టర్ రమణారావు అత్యుత్సాహంతో వీరిని బీచ్ క్లీనర్లుగా మార్చారు. కాస్తోకూస్తో చదువుకున్న వీరిని బీచ్ క్లీనర్లుగా మార్చడంపై విమర్శలు వచ్చాయి. ఇదేంటని ప్రశ్నించిన వారిని ‘నచ్చితే ఉద్యోగంలో కొనసాగండి.. లేకుంటే మానేయండి’అంటూ ఆర్డీ హెచ్చరించారు. దీంతో చేసేదేమీ లేక మనసు చంపుకుని బీచ్ క్లీనింగ్ పనులు చేస్తున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నెలలు గడుస్తున్నా.. జీతం అందకపోవడంతో తమ గోడు ఎవరికి వెళ్లబోసుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇల్లు ఖాళీ చేసేశాం
మేము అద్దె ఇంట్లో ఉంటున్నాం. మూడు నెలల నుంచి జీతం అందక అద్దె ఇవ్వకపోవడంతో.. ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమన్నారు. చేసేదేమీ లేక ఇల్లు ఖాళీ చేసేశాం. మా బతుకులు రోడ్డెక్కాయి. జీతాలు అడిగితే ఉద్యోగం మానేమంటున్నారు. మా బాధ ఎవరితో చెప్పుకోవాలి.
– జి.రత్న, ఉద్యోగి
పిల్లల చదువు మాన్పించేశాం
మూడు నెలల నుంచి జీతాలు లేక ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. జీతం ఎప్పుడిస్తారని అడిగితే రేపు, ఎల్లుండి అంటూ దాటవేస్తున్నారు. దీంతో అప్పులు చేసి మరీ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. పిల్లల బడి ఫీజులు కట్టలేక చదువు మాన్పించేశాం.
– కల్యాణి, ఉద్యోగి

రుషికొండ బీచ్ ఉద్యోగులకు జీతాల్లేవ్..

రుషికొండ బీచ్ ఉద్యోగులకు జీతాల్లేవ్..
Comments
Please login to add a commentAdd a comment