
నగర శుభ్రతే లక్ష్యం
‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్’లో
కలెక్టర్ హరేందిర ప్రసాద్
మహారాణిపేట: పరిసరాలు శుభ్రంగా ఉంచుకుందామని, ఆరోగ్యకర, ఆహ్లాదకర వాతావరణంలో పని చేద్దామని స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. నగర శుభ్రతే లక్ష్యంగా అందరూ భాగస్వామ్యం కావాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు, ఇతర సంస్థల పరిధిలో అధికారులు, సిబ్బంది, విద్యార్థులు స్వచ్ఛందంగా పరిసరాల పరిశుభ్రతా చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా శనివారం కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వో, అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొని కలెక్టరేట్ పరిసరాలను శుభ్రం చేశారు. గార్డెన్‌లోని పిచ్చి మొక్కలను తొలగించారు. తడి– పొడి చెత్తను వేర్వేరు చేస్తూ డస్ట్ బిన్లలో వేశారు. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ ఆవశ్యకతను తెలుపుతూ పోస్టర్ను ప్రదర్శించారు. ప్రమాదకర వ్యర్థాలను, తడి–పొడిచెత్తను ఎలా వేరు చేయాలి, ఎలా తరలించాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరేందిర ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేకరించిన వ్యర్థాలను వేర్వేరు డబ్బాల్లో వేసి తరలించాలని పేర్కొన్నారు. అనంతరం అందరి చేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్, జిల్లా రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీ శంకర్, ప్రత్యేక ఉప కలెక్టర్ శేష శైలజ, కలెక్టరేట్ ఏవో ఈశ్వరరావు, ఇతర సెక్షన్ల సూపరింటెండెంట్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

నగర శుభ్రతే లక్ష్యం
Comments
Please login to add a commentAdd a comment