నిధుల సంకటం
ఎమ్మెల్సీ ఎన్నికకు
● ఎన్నికల నిర్వహణకు రూ.3 కోట్ల వరకు ఖర్చు? ● పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా విడుదల కాని నిధులు ● ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న జిల్లా యంత్రాంగం
మహారాణిపేట: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్నికల తేదీ దగ్గర పడుతోంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం గానీ, ఎన్నికల కమిషన్ గానీ పైసా కూడా విదల్చలేదు. మరోవైపు ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని మాత్రం అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుండడం గమనార్హం. దీంతో జిల్లా అధికారులు ప్రత్యామ్నాయ నిధులను ఎన్నికల నిర్వహణకు ఖర్చు చేస్తున్నారు.
ఈ నెల 27న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రంతో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ముగియనుంది. 27వ తేదీన పోలింగ్, వచ్చే నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇప్పటికే కర్నూలు ప్రభుత్వ ముద్రణ శాలలో పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ పత్రాల ప్రింటింగ్ ప్రక్రియ పూర్తవడంతో అవి విశాఖకు చేరుకున్నాయి. వాటిని ఇక్కడి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు పంపించారు. వాస్తవానికి ఈ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి నిధులు విడుదల చేయలేదు. దీంతో జిల్లా అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో ఇతర ఫండ్స్ నుంచి నిధులను మళ్లించి ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి నిధులు రాని పక్షంలో మళ్లీ వాటిని సర్దుబాటు చేయడం అధికారులకు తలనొప్పిగా మారే అవకాశముంది.
21,555 మంది ఓటర్లు
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 21, 555 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 12,948 మంది పురుషులు, 8,607 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 4,829 మంది, విజయనగరంలో 4,937, మన్యం పార్వతీపురం మన్యంలో 2,262, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 1,448, విశాఖలో 5,277, అనకాపల్లి జిల్లాలో 2802 మంది ఓటర్లు ఉన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో ఓటర్ల కోసం టెంట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల సామగ్రి కొనుగోలు, ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లు, తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. తొలి విడతగా ఎన్నికల నిర్వహణపై మంగళవారం సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మళ్లీ ఈ నెల 24న మరోసారి శిక్షణ ఇవ్వనున్నారు. మార్చి 3న ఆంధ్రా యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటికి కూడా నిధులు అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అధికారులు నానా తంటాలు పడుతున్నారు.
ఎన్నికల ఖర్చు రూ.3 కోట్లు!
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ ఎన్నికల ప్రధాన అధికారిగా వ్యవహరిస్తున్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో ఎన్నికల నిర్వహణ కోసం మొత్తం రూ.3 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. 123 పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లకు నిధులు అవసరం. పోలింగ్ సిబ్బంది భోజనాలు, పోలింగ్ తర్వాత టీఏ, డీఏలు కూడా చెల్లించాల్సి ఉంది.
నిధుల సంకటం
Comments
Please login to add a commentAdd a comment