ఏయూలో రాజకీయ క్రీడ
విశాఖ విద్య: ఖ్యాతిగడించిన ఆంధ్ర యూనివర్సిటీకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజకీయ చెదలు పడుతున్నాయా..?. పీహెచ్‌డీ స్కాలర్స్ విషయంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో వర్సిటీ వర్గాలతో పాటు, విద్యావేత్తల్లోనూ ఇదే చర్చసాగుతోంది. వర్సిటీ పురోభివృద్ధి కోసమని గత వీసీ ప్రసాద్ రెడ్డి టీడీఆర్ హబ్ ఏర్పాటు చేయగా, దీన్ని నిర్యీర్యం చేయడమే లక్ష్యమన్నట్లుగా ప్రస్తుత పాలకులు తీసుకున్న నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్‌కు ప్రశ్నార్థకమౌతున్నాయి. పీహెచ్‌డీ స్కాలర్స్ విషయంలో వ్యవహరిస్తున్న తీరు దేశవ్యాప్తంగా చర్చసాగుతోంది. ఆంధ్ర యూనివర్సిటీలో కొంతమంది అవినీతి ఆచార్యులు తమ స్వలాభం కోసం వేస్తున్న ఎత్తుగడలకు పరిశోధక విద్యార్థులు బలిపశువులవుతున్నారు.
టీడీఆర్ హబ్ ద్వారా ప్రవేశాలు పొందిన పరిశోధక విద్యార్థులకు పరీక్షలను నిలిపివేస్తూ, వర్సిటీ అధికారులు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. 2019 నుంచి 2023 వరకు ఏయూ టీడీఆర్ హబ్ ద్వారా సుమారుగా 680 మంది పరిశోధక విద్యార్థులు ప్రవేశం పొందారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సిఫార్సుతో చేరిన కొద్దిమంది మిగతా వారంతా ఉన్నత విద్యామండలి నిర్వహించే ఏపీఆర్–సెట్ ద్వారా మెరిట్ ప్రాతిపదికన ఆంధ్ర యూనివర్సిటీలో చేరారు. వీరికి ఇప్పటికే ప్రీ పీహెచ్‌డీ, వైవా నిర్వహించాలి. వాటిని పూర్తి చేసిన వారికి అవార్డు ప్రదానం చేయాలి. కానీ, గత వీసీ ప్రసాద్ రెడ్డిపై రాజకీయ కక్షతో పరిశోధక విద్యార్థులకు పరీక్షలను సైతం నిలిపివేశారు.
అవినీతి ఆచార్యులతో అపఖ్యాతి
పీహెచ్‌డీ స్కాలర్స్ నుంచి పరీక్షల పేరిట డబ్బులు వసూలు చేసే ఆనవాయితీకి నాటి వీసీ ప్రసాదరెడ్డి బ్రేక్ వేశారు. దీన్ని జీర్ణించుకోలేని వర్సిటీలోని ఓ వర్గం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పనిగట్టుకొని ఫిర్యాదులు చేయడంతో, ఆ ప్రభావం పరిశోధక విద్యార్థులపై పడింది. టీడీఆర్ హబ్ ద్వారా జరిగిన ప్రవేశాలపై వర్సిటీ ఉన్నత స్థాయి కమిటీ విచారణ జరిపి, 40 మంది పరిశోధకుల ప్రవేశాల విషయంలో లోపాలను ఎత్తి చూపినట్లు తెలిసింది. మిగతా వారంతా యూజీసీ నిబంధనలకు అనుగుణంగానే ప్రవేశాలు పొందారని తేల్చినా, పరీక్షలు జరగనివ్వకుండా వర్సిటీలోని కొంతమంది అవినీతి ఆచార్యులు అడ్డుపుల్లలు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పరిశోధక విద్యార్థుల్లో పెరుగుతున్న అసంతృప్తి
ఆంధ్ర యూనివర్సిటీకి ఉన్న క్రేజ్‌తో పీహెచ్‌డీ కోసమని చేరితే, అధికారులు ఇబ్బందులు గురి చేస్తుండటంపై వారిలో అసంతృప్తి పెరుగుతోంది. పరీక్షలు ఎందుకు నిలిపివేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పరిశోధక విద్యార్థులతో ‘జాయింట్ యాక్షన్ కమిటీ’ ఏర్పాటైంది. పరీక్షలను వెంటనే నిర్వహించాలని కోరుతూ సోమవారం ఉదయం 10 గంటల నుంచి వర్సిటీ వైస్ చాన్సలర్ భవనం ముందు శాంతియుత నిరసన చేపడుతున్నట్లు ప్రకటించారు. ఆందోళనలో పాల్గొనేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పరిశోధక విద్యార్థులు ఇప్పటికే నగరానికి చేరుకున్నట్టు జేఏసీ ప్రతినిధులు తెలిపారు.
పీహెచ్‌డీ స్కాలర్స్‌పై ఎందుకీ కక్ష
పరీక్షల నిర్వహణకు చొరవ చూపని అధికారులు
పరిశోధకులను ఇబ్బంది పెడుతున్న
ఓ వర్గం
వర్సిటీ అధికారుల తీరుపై పెరుగుతున్న అసంతృప్తి
నేడు శాంతియుత ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment