రోడ్డెక్కిన చిరుద్యోగులు
● ఆందోళన కొనసాగించిన రుషికొండ బీచ్ ఉద్యోగులు
● విధుల బహిష్కరణతో దిగొచ్చిన టూరిజం అధికారి
● నేడు జీతాలు చెల్లిస్తానని ఆర్డీ హామీ
కొమ్మాది: అంతర్జాతీయ గుర్తింపు పొందిన రుషికొండ బీచ్‌లో పనిచేస్తున్న చిరు ఉద్యోగులు రెండో రోజూ విధులు బహిష్కరించారు. మూడున్నర నెలల నుంచి వీరికి జీతాలు విడుదల చేయకపోవడంతో శనివారం ఆందోళనకు దిగి, విధులు బహిష్కరించిన సంగతి తెలిసిందే. అధికారులు స్పందించకపోవడంతో ఉద్యోగులు ఆదివారం రుషికొండ బీచ్ వద్ద రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. తమకు వెంటనే జీతాలు విడుదల చేయాలని నినదిస్తూ రెండు గంటల పాటు రోడ్డుపైనే నిరసన తెలిపారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పర్యాటకులు ఇబ్బందులు పడ్డారు. వాస్తవానికి ఈ నెల 7న వీరికి సంబంధించిన మూడు నెలల జీతం మొత్తం రూ.14,72,268 విడుదలైంది. అయితే రీజనల్ డైరెక్టర్ రమణారావు నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు తమకు ఎటువంటి జీతం అందలేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
ఆర్డీని నిలదీసిన ఉద్యోగులు
రుషికొండ బీచ్‌లో రోడ్డుపై ఉద్యోగులు బైఠాయించి ఆందోళన చేస్తున్నారనే విషయం తెలుసుకున్న ఆర్డీ రమణారావు.. అక్కడకు చేరుకోగా ఆయన్ని చుట్టిముట్టి నిలదీశారు. మూడు నెలల నుంచి జీతాలు లేక ఆకలితో అలమటిస్తుంటే మీరెందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. జీతాలు ఇస్తే తప్ప విధులకు హాజరుకామని ఉద్యోగులు స్పష్టం చేశారు. సంక్రాంతి నుంచి జీతాలు ఇస్తామని చెబుతున్నప్పటికీ.. ఎందుకు ఇవ్వడం లేదన్నారు. సోమవారం తప్పనిసరిగా జీతాలు ఇస్తామని చెప్పడంతో ఉద్యోగులు ఆందోళన విరమించారు. కానీ జీతం ఇచ్చేంత వరకు విధులకు హాజరుకామని తేల్చి చెప్పారు.
అందరినీ పీకేస్తా..
చిరు ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో ఆర్డీ రమణారావు వారిపై రుసరుసలాడారు. జీతాలు ఇస్తానని చెప్పినా ఆందోళన చేయడం ఏమిటని మండిపడ్డారు. జీతాలు ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరిని ఉద్యోగాల నుంచి పీకేస్తానని వారిని హెచ్చరించినట్లు సమాచారం. మూడున్నర నెలల నుంచి జీతాలు లేక ఆవేదనతో ఆందోళన చేస్తే.. సహకరించాల్సింది పోయి ఆర్డీ తమపైనే ఆగ్రహం వ్యక్తం చేయడం సరికాదని ఉద్యోగులు అన్నారు. ఒక్కొక్కరిగా ఇంటికి పంపించేస్తానని హెచ్చరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు ఇచ్చిన తర్వాత ఉద్యోగాల నుంచి తొలగిస్తే ఇదే బీచ్‌లో ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. కాగా.. 7వ తేదీ జీతాలు వచ్చినా ఇంత వరకు ఎందుకు ఇవ్వలేదని ఆర్డీని విలేకరుల ప్రశ్నించగా.. కలెక్టర్ అనుమతితో జీతాలు ఇస్తామని కొత్త భాష్యం చెప్పారు. ఉద్యోగులు విధులకు హాజరు కాకపోవడంతో బీచ్ ప్రాంతమంతా అధ్వానంగా తయారైంది. ఎక్కడ చెత్త అక్కడ ఉండిపోవడం, దుర్వాసనతో పర్యాటకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డెక్కిన చిరుద్యోగులు
Comments
Please login to add a commentAdd a comment