
మొదటి మెట్టు.. ప్రత్యేక పట్టు
చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(ఇంగ్లిష్ మీడియం) ప్రభుత్వ విద్యా రంగంలో ఒక ప్రత్యేక అధ్యాయం. రాష్ట్రంలోనే అతి పెద్ద పాఠశాలగా గుర్తింపు పొందిన ఇక్కడ సుమారు 3,235 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలకు 799 మంది సిద్ధమవుతున్నారు. వంద మందికి పైగా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం ఈ పాఠశాలకు పెద్ద ఆస్తి. పదో తరగతి పరీక్షలు విద్యార్థుల జీవితంలో ఒక మైలురాయి వంటివి. ఈ పరీక్షల ఫలితాలే వారి భవిష్యత్‌ను నిర్ణయిస్తాయి. ఈ విషయాన్ని గుర్తెరిగిన ఉపాధ్యాయులు, విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో టీచర్లు మరింత నిబద్ధతతో పనిచేస్తున్నా రు. తరగతి గదిలో పాఠాలు బోధించడంతో పాటు, వెనుకబడిన విద్యార్థులను ప్రత్యేకంగా గుర్తించి వారిపై దృష్టి సారిస్తున్నారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి మంచి ఫలితాలు సాధించేలా ప్రోత్సహిస్తున్నారు. 100 రోజుల ప్రణాళికను విజయవంతంగా అమలు చేసేందుకు ఆర్జేడీ విజయభాస్కర్, డీఈవో ప్రేమ్‌కుమార్, సర్వశిక్ష ఏసీపీ డాక్టర్ చంద్రశేఖరరావు తదితరులు సైతం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ప్రణాళిక అమలు ఇలా..
జిల్లాలో మార్చి 17 నుంచి రోజు విడిచి రోజు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ విద్యార్థులను ఏ నుంచి ఓ వరకు 12 సెక్షన్‌లుగా విభజించారు. ఇందులో ప్రతి సెక్షన్, ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించారు. శత శాతం ఉత్తీర్ణతకు 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను అమలు చేస్తున్నారు. తరగతిలో బోధనతో పాటు ప్రతి రోజూ ఉదయం 8 గంటలు నుంచి 9 వరకు, సాయంత్రం 4 నుంచి 5 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వ్యక్తిగత సామర్థ్యాలపై దృష్టి పెట్టి, అందుకు అనుగుణంగా బోధన చేస్తున్నారు. మెరిట్ విద్యార్థులకు ప్రత్యేక టిప్స్, శిక్షణ ఇస్తున్నారు. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చిన వారిని గుర్తించి.. వారి సామర్థ్యాలు పెంపునకు కృషి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment