మాపై ఎందుకీ కక్ష?
విశాఖ విద్య: ఆంధ్రా యూనివర్సిటీలో పరిశోధక విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఏయూలో పీహెచ్‌డీ ప్రవేశాలు పొందిన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 60 మందికి పైగా పరిశోధక విద్యార్థులు వీసీ కార్యాలయం ముందు గాంధీజీ, అంబేడ్కర్ విగ్రహాల వద్ద సోమవారం నిరసనకు దిగారు. వైవా, ప్రీ–పీహెచ్‌డీ పరీక్షలు వెంటనే నిర్వహించాలని ప్లకార్డులు, ఫ్లెక్సీలు చేత పట్టుకుని ‘వుయ్ వాంట్ జస్టిస్’అంటూ నినాదాలు చేశారు. 2019 నుంచి 2023 వరకు ఏపీఆర్‌సెట్ ద్వారా చేరిన వారికి అకారణంగా పరీక్షలు నిలిపివేయడం పట్ల పరిశోధక విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైవా, ప్రీ–పీహెచ్‌డీ పరీక్షలు వెంటనే నిర్వహించాలని, ప్రీ–టాక్ పూర్తి చేసుకున్న వారికి వెంటనే అవార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు. తమ మనోభావాలతో వర్సిటీ అధికారులు ఆటలాడుకోవడం ఎంత మాత్రం సమంజసం కాదని అన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశోధక విద్యార్థులతో చర్చించారు. ఆందోళన విరమించాలని కోరారు. అయితే, తమకు వర్సిటీ అధికారుల నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదని తెగేసి చెప్పారు. దీంతో పోలీసులు విద్యార్థుల డిమాండ్లను వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
పరీక్షల నిర్వహణకు వీసీ హామీ
టీడీఆర్–హబ్ డీన్ ఆచార్య మల్లికార్జునరావు నిరసనకు దిగిన విద్యార్థుల వద్దకు వచ్చి చర్చించారు. పీహెచ్‌డీ స్కాలర్స్‌కు త్వరలోనే పరీక్షలు నిర్వహించి, అవార్డులు ప్రదానం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఇదే విషయాన్ని వైస్ చాన్సలర్ చెప్పాలని పీహెచ్‌డీ స్కాలర్స్ పట్టుబట్టారు. దీంతో ఆయన పీహెచ్‌డీ స్కాలర్స్ జేఏసీ ప్రతినిధులను వీసీ జి.శశిభూషణరావు వద్దకు తీసుకువెళ్లారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయిలో సమీక్ష జరిగిందని, త్వరలోనే తగిన ఏర్పాట్లు చేస్తామని వీసీ హామీ ఇచ్చినట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు.
వర్సిటీ అధికారుల తీరు మారాల్సిందే..
టీడీఆర్–హబ్ ద్వారా జరిగిన పీహెచ్‌డీ ప్రవేశాలపై ఏమైనా అనుమానాలు ఉంటే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చని.. కానీ తమపై కక్ష గట్టినట్లుగా పరీక్షలు నిలిపివేయడం ఎంతవరకు సమంజసమని పరిశోధక విద్యార్థులు అన్నారు. నిరసన విరమించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. వర్సిటీ అధికారుల తీరు మారాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీఆర్ సెట్ రాసి, మెరుగైన ర్యాంకులు సాధించి వర్సిటీలో పీహెచ్‌డీ చేద్దామని ఇక్కడికి వస్తే.. అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు తమను బాధపెట్టాయన్నారు. తక్షణమే ప్రీ–పీహెచ్‌డీ, వైవా పరీక్షలు నిర్వహించాలని, ప్రీ–టాక్ పూర్తయిన వారికి అవార్డులు ప్రదానం చేయాలని డిమాండ్ చేశారు.
ఏయూలో పీహెచ్‌డీ స్కాలర్స్ నిరసన గళం
వైస్ చాన్సలర్ కార్యాలయం
ముందు ఆందోళన
పరీక్షలు ఎందుకు రద్దు చేశారో చెప్పాలని పట్టు
Comments
Please login to add a commentAdd a comment