వేతనాలు పెంచాలని అంగన్‌వాడీ వర్కర్ల ధర్నా
సీతమ్మధార: అంగన్‌వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కారించాలని కోరుతూ సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సుబ్బరావమ్మ మాట్లాడుతూ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2019 నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలకు వేతనాలు పెరగలేదన్నారు. వేతనాల పెంపు, తదితర సమస్యల పరిష్కారం కోసం 42 రోజు సమ్మె చేశామని గుర్తు చేశారు. ఈ క్రమంలో 2024 జూలైలో వేతనాలు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని, ఇతర సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చిందన్నారు. అయినప్పటికీ నేటి వరకు సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేసినట్లు చెప్పారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం స్పందించాలని, లేకపోతే పెద్ద ఎత్తున పోరాటానికి కార్యకర్తలు, ఆయాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాట్యూటీ అమలు చేయాలన్నారు. మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్పు చేస్తూ వెంటనే జీవో ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాలు అంగన్‌వాడీలకు అమలు చేయాలని, సాధికారత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు అనే పదాన్ని తొలగించాలని కోరారు. సర్వీసులో ఉండి చనిపోయిన వారికి దహన సంస్కార ఖర్చులకు రూ. 20 వేలు, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వెంకటలక్ష్మి, ఎల్.దేవి, అర్బన్ ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు నూకరత్నం, జిల్లా కోశాధికారి పద్మ, ఉపాధ్యక్షులు శోభారాణి, నాగేశ్వరి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్, కార్యదర్శి జి.అప్పలరాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment