ఆరిలోవ: హెల్త్‌సిటీలోని కేర్ ఆస్పత్రిలో ఒక రోగి మృతి చెందడం ఆందోళనకు దారి తీసింది. ఆస్పత్రి యాజమాన్యం మృతదేహాన్ని అప్పగించడానికి రూ.5లక్షలు డిమాండ్ చేయడంతో మృతుడి కుటుంబ సభ్యులు నిరసనకు దిగారు. మృతుడి బంధువులు తెలిపిన వివరాలివి.. చోడవరానికి చెందిన బండి శ్రీధర్ (55) గుండెనొప్పితో బాధపడుతుండగా, ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు కుటుంబ సభ్యులు హెల్త్‌సిటీలోని కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. అతనికి అత్యవసరంగా గుండె శస్త్రచికిత్స చేయాలని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు అంగీకరించారు. ముందుగా ఆస్పత్రికి రూ.60 వేలు చెల్లించారు. అర్ధరాత్రి 12.30 నుంచి ఒంటి గంట మధ్య సమయంలో ఐసీయూలో ఉన్న శ్రీధర్‌ను చూడటానికి కుటుంబ సభ్యులు వెళ్లగా.. అతను మృతి చెందినట్లు గుర్తించారు. వైద్యులను సంప్రదించగా వారు పరిశీలించి శ్రీధర్ మరణించినట్లు నిర్ధారించారు. శ్రీధర్‌కు రెండు శస్త్రచికిత్సలు చేశామని, వాటికి సంబంధించిన ఫీజు చెల్లించాలని వైద్యులు సూచించారు. మృతదేహాన్ని అప్పగించడానికి రూ.5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో ఆగ్రహించిన శ్రీధర్ కుమారులు ‘గుండె జబ్బు నయం చేస్తామని చెప్పి మా నాన్నను చంపేశారు’ అంటూ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం బంధువులకు తెలియడంతో చోడవరం నుంచి సోమవారం ఉదయం ఆస్పత్రికి చేరుకుని ఆందోళనకు దిగారు. మృతదేహం కోసం డబ్బులు చెల్లించమని, వెంటనే మృతదేహాన్ని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ సమాచారం అందుకున్న ఆరిలోవ సీఐ మల్లేశ్వరరావు, ఎస్‌ఐ కృష్ణ సిబ్బందితో కలిసి కేర్ ఆస్పత్రికి చేరుకున్నారు. బాధితులు, ఆస్పత్రి యాజమాన్యంతో చర్చలు జరిపారు. ముందు చెల్లించిన రూ.60వేలతో పాటు అదనంగా రూ.1.10 లక్షలు చెల్లించి మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి బంధువులు అంగీకరించారని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. దీంతో ఆందోళన సద్దుమణిగింది. శస్త్రచికిత్స చేసే సమయంలో అంగీకార పత్రంపై సంతకాలు తీసుకున్నట్లు వైద్యులు తెలిపారు.
మృతదేహం ఇచ్చేందుకు రూ.5 లక్షల డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment